స్మార్ట్ వాచ్ తో.. వృద్ధులు సేఫ్..!
1 min read– వృద్ధుల డిమోన్షియా కోసం స్మార్ట్ వాచ్ ఆలోచన అద్భుతం
* అన్వయ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవంలో వక్తలు
* వారికి ఏం జరిగినా క్షణాల్లో సమాచారం
* ఎక్కడున్నా వాళ్లను గుర్తించే అవకాశం
* ఇలాంటి ఆవిష్కరణలు అన్నివర్గాలకూ ఉపయోగం
హైదరాబాద్: వృద్ధులలో డిమెన్షియా (మతిమరుపు) సమస్య సర్వసాధారణంగా వస్తుందని, కానీ దాన్ని అధిగమించేందుకు తగిన వ్యవస్థలు ఇన్నాళ్లూ సరిగా లేవని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అన్వయ సంస్థ వారికోసం ప్రత్యేకంగా ఒక స్మార్ట్ వాచ్ రూపొందించడం, దానికి పేటెంటు కూడా పొందడం ఎంతో అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. దీనివల్ల వృద్ధులు ఎక్కడున్నా తెలుస్తుందని, అలాగే వారికి ఏం జరిగినా వారి సంరక్షకులకు క్షణాల్లో సమాచారం వెళ్తుందని.. ఇలాంటి పరికరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులందరి సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అన్వయ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం, వ్యవస్థాపకుల దినోత్సవాన్ని బేగంపేటలోని ఫ్యామిలీ వరల్డ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సంతోష్ మెహ్రా, టెక్ మహీంద్రా హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ వినయ్ అగర్వాల్, టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, ఇండియా-ఇన్ఫర్ సంస్థ ఎండీ రంగ పోతుల, ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ అడ్వైజర్ శక్తిసాగర్, అన్వయకేర్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ దీపికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలోచన..విభిన్నం: మహంకాళి శ్రీనివాస రావు, టి–హబ్ సీఈఓ
టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్టార్టప్ ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటున్నాయని, వృద్ధుల సంరక్షణ కోసం ఏఐ ఆధారిత యాప్ తీసుకురావడం, వారి సమస్యలను సమగ్రంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. అన్వయ కేర్ సంస్థ సేవలు మరింతమందికి అందాలని అభిలషించారు. “డిమెన్షియా అనేది వయోవృద్ధులందరిలో చాలా ఎక్కువగా కనపడుతున్న సమస్య. అయితే దీన్ని పరిష్కరించేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రావట్లేదు. అసలు వృద్ధులు అంటే కేవలం ఆరోగ్య సమస్యలే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అన్వయ సంస్థ అద్భుతమైన సేవలు అందిస్తోంది. వాళ్లు ఒక స్మార్ట్ వాచ్ తయారుచేసి, దానికి పేటెంటు కూడా తీసుకోవడం చాలా బాగుంది. యూరోపియన్ దేశాల్లో సైకిళ్లపై వెళ్లేవారు తరచు ప్రమాదాలకు గురవుతారు. వాళ్లు ఆస్పత్రికి వెళ్లేలోపే వాళ్ల వైటల్స్, ఇతర వివరాలు అన్నీ డాక్టర్‌కు చేరిపోతాయి. ఇక్కడ ఈ వాచీని కూడా ప్రమాద బాధితులకు ఉపయోగపడేలా చేయాలి. వాళ్లను అంబులెన్సులోకి ఎక్కించగానే వాచీ పెట్టినా.. ముఖ్యమైన వివరాలన్నీ వైద్యులవద్ద సిద్దంగా ఉండి, వెంటనే చికిత్స ప్రారంభించగలరు. ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చినందుకు ప్రశాంత్‌కు అభినందనలు” అని ఆయన చెప్పారు.
లక్ష్యంతో…ముందుకెళ్తాం… : ప్రశాంత్ రెడ్డి , సంస్థ వ్యవస్థాపకుడు
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, “వయోవృద్ధులకు సేవలు అందించే లక్ష్యంతో మా సంస్థను స్థాపించాం. అనతికాలంలోనే బెంగళూరు, చెన్నై లాంటి 40 నగరాలకూ విస్తరించాం. దీనికిగాను మాకు ఐఐటీ మద్రాస్ నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, హైసియా నుంచి.. ఇలా పలు వర్గాల నుంచి మాకు గుర్తింపు, అవార్డులు వచ్చాయి. కొవిడ్ నుంచి చాలామందిని రక్షించాం. హోం క్వారంటైన్ ఏర్పాటుచేశాం. అన్వయ స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంను ఏర్పాటుచేసి, దానికి పేటెంటు కూడా సాధించాం. డిమెన్షియా కేర్ రంగంలో ఏమీ లేదని, వృద్ధులకు సేవలు అందించాలని గుర్తించాం. అప్పుడే భారతదేశంలోనే తొలిసారిగా ఏఐ ఎనేబుల్డ్ డిమెన్షియా కేర్ ఎట్ హోంను ప్రారంభించాం. ఉద్యోగుల సంరక్షణ కోసం అనన్య నిశ్చింత్ అనే ఏఐ ప్లాట్‌ఫాం తీసుకొచ్చాం. అనన్య కిన్ కేర్ అనే రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టం ప్రవేశపెట్టాం. ఇది రాబోయే 20 ఏళ్లకు సరిపోయే వ్యవస్థ. పెద్దవాళ్లు మనల్ని పెంచి పెద్దచేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వారికి అవసరమైనవి కల్పించడం మన విధి. అందుకే వారికి ఇంటివద్ద నర్సులు, డాక్టర్లను పంపడం, ల్యాబ్ శాంపిళ్లు ఇంటివద్దే సేకరించడంతో పాటు చివరకు ప్లంబర్లను పంపడం, ఉబర్ క్యాబ్‌లు బుక్ చేయడం వరకు అన్నిరకాల సేవలనూ అనన్య సంస్థ అందిస్తుంది” అని వివరించారు.