PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ట్టి మిద్దె కూలి  నలుగురు మృతి… ఘ‌ట‌న‌పై చలించిన సీఎం చంద్రబాబు

1 min read

తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు

బాలిక సంర‌క్షణ బాధ్యత తీసుకుంటామ‌ని సీఎం ప్రక‌టన

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో ఘటన

పల్లెవెలుగు వెబ్ అమరావతి : నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి స‌మ‌యంలో మ‌ట్టి  మిద్దె  కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు  మృతి చెందిన  ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్థరాత్రి మట్టి మిద్దె కూలడంతో వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్ తో పాటు ఆయ‌న భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. వర్షాలకు నాని మిద్దె కూలిపోయింది. దీంతో నిద్రలోనే గురుశేఖర్ తో పాటు భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. రెండో కుమార్తె తల్లపురెడ్డి గురు ప్రసన్న(15) ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుకుంటోంది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులతో సహా తోబుట్టువులు చనిపోవడంతో ప్రసన్న అనాథ అయ్యింది. ఈ ఘటనపై సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ప్రసన్నకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరుపున రూ.10 లక్షల సాయం ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ తల్లపురెడ్డి నాగమ్మ(70) సంరక్షణలో ఉందని అధికారులు వివరించారు. ప్రసన్న పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేయడంతో పాటు….వృద్ధురాలైన నాగమ్మకు కూడా రూ.2 లక్ష సాయం అందించాలని సీఎం అధికారులను అదేశించారు. జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ధైర్యం చెప్పాలని సూచించారు. చిన్న వయసులో తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన ఆ బాలికకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా నిలుస్తామని సీఎం అన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

About Author