అరుదైన వ్యాధి… వైద్యం ఖరీదు రూ.18 కోట్లు
1 min read– నిలబడలేదు… నడవలేదు…
– స్పైనల్ మస్కులర్ అట్రోఫి గా గుర్తించిన న్యూరోఫిజిషియన్ డా. హేమంత్ కుమార్
– ఈ వ్యాధికి చికిత్స… జోల్ జెరి ఎస్ఎంఏ (ZOLGENSMA)ఇంజెక్షన్ వేయాలని వెల్లడి
– ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్న చిన్నారి తల్లిదండ్రులు
కర్నూలు: సైంధవ్ సినిమాలో హీరో వెంకటేష్ కూతురుకు వచ్చిన అరుదైన వ్యాధే… కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన నాగేష్, మరియమ్మ దంపతుల కూతురు అక్షయ (2) కు వచ్చింది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఆ దంపతులకు… పాపకు ఏ వ్యాధి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. పాప ఎదుగుతున్నా… కండరాలు సహకరించకపోవడంతో నిలబడలేకపోయింది. నడవలేకపోతోంది. ఈ క్రమంలో ఆ దంపతులు చికిత్స కొరకు ఆదోని లోని న్యూరోఫిజిషియన్ వైద్యులు డా. హేమంత్ కుమార్ ను సంప్రదించారు. పాపను పరీక్షించిన ఆయన … లక్షణాలు, పరిస్థితిని బట్టి స్పైనల్ మస్కులర్ అట్రోఫి అనే వ్యాధి పాపకు వచ్చినట్లు గుర్తించారు. జెనిటిక్ టెస్ట్ చేయించి వ్యాధి ని నిర్ధారించారు. పాప చికిత్స కు జోల్ జెరి ఎస్ఎంఏ అనే ఇంజెక్షన్ వేయాలని, దాని ఖరీదు రూ.18 కోట్లు ఉంటుందని వెల్లడించిన డా. హేమంత్ కుమార్… జన్యుపరమైన కారణాలతో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే ఆ దంపతులు చేసేదేమీ లేక రాష్ట్ర ప్రభుత్వం, దాతలు ఆదుకొని.. పాప ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.