అర్హులైన ప్రతి పేదవాడికి మూడు సెంట్ల ఇంటి స్థలం అందజేస్తాం
1 min readజగనన్న కాలనీలు అంతా అవినీతిమయం, అవివేక పాలన
పేదవాడికి సొంత ఇంటి నిర్మాణం పేరుతో గత వైసిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ కి దృష్టికి తీసుకు రాగా, ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరుతో గత వైసిపి ప్రభుత్వం పేదవాడిని మోసం చేసిందని, నివాస యోగ్యం కానీ ప్రాంతాల్లో చేపట్టిన స్థల సేకరణ పేరిట కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారని, అసంపూర్తిగా పేదవాడి ఇళ్ల నిర్మాణాలు వదిలేసి వైసిపి నాయకులు మాత్రం కోట్ల రూపాయల డబ్బు అక్రమంగా దోచుకున్నారని అన్నారు. సెంటున్నర స్థలంలో ఒక కుటుంబం నివాసం ఉండటం సాధ్యమా అని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వారి మూగజీవాలు కూడా ఉంటాయని వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం తెలియని జగన్ ది అవివేక పాలన అని చింతమనేని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవాడికి మూడు సెంట్ల నివాస స్థలం ఇచ్చి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయటానికి చర్యలు చేపట్టినట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.