చిన్నపేగుల్లో గ్యాంగ్రిన్
1 min read* 45 ఏళ్ల వ్యక్తికి అత్యంత అరుదైన మెసెంటెరిక్ ఇష్కెమియా
* దానివల్ల గుండెపోటు లాంటివి వచ్చే ప్రమాదం
* కిమ్స్ సవీరాలో అత్యవసర శస్త్రచికిత్సతో ప్రాణదానం
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన మెసెంటెరిక్ ఇష్కెమియా అనే వ్యాధి ఉన్న వ్యక్తికి అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అత్యవసర శస్త్రచికిత్స చేసి, ప్రాణాలు కాపాడారు. సరైన సమయానికి శస్త్రచికిత్స చేయకపోతే దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ లాంటివి సంభవించి, ప్రాణాపాయం కూడా పొంచి ఉండేది. తీవ్రమైన కడుపునొప్పితో ఏడు రోజులుగా బాధపడుతున్న 45 ఏళ్ల వ్యక్తి చికిత్స కోసం పలు ఆస్పత్రులు తిరిగినా అతడికి ఏమాత్రం ఊరట లభించలేదు. అనంతరం కిమ్స్ సవీరా ఆస్పత్రికి రాగా.. అక్కడ సీఈసీటీ స్కాన్ చేస్తే పేగుల్లో తీవ్రమైన అడ్డంకి ఉందని, అది బహుశా గ్యాంగ్రిన్ కావచ్చని తేలింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆస్పత్రిలోని కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మహ్మద్ షహీద్ అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. అందులో దాదాపు 300 సెంటీమీటర్ల మేర చిన్నపేగుకు గ్యాంగ్రిన్ సోకింది. దీనికి కారణం.. మెసెంటెరిక్ ఇష్కెమియా, అంటే రక్తం సరఫరా కాకపోవడం. గ్యాంగ్రిన్ బారిన పడిన పేగును తీసేసి, మిగిలిన పేగును కలిపి కుట్టేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగి వారం రోజుల్లో పూర్తిగా కోలుకుని, ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతడిని డిశ్చార్జి చేశారు. అసలేమిటీ మెసెంటెరిక్ ఇష్కెమియాఎక్యూట్ మెసెంటెరిక్ ఇష్కెమియా (ఏఎంఐ) అనేది ఉన్నట్టుండి రక్తసరఫరా తగ్గిపోవడం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల ఇలా జరుగుతుంది. దీనివల్ల పేగుల్లో నెక్రోసిస్, సెప్సిస్ లాంటివి సంభవించి, సరైన సమయానికి చికిత్స చేయకపోతే మరణిస్తారు. ఇలాంటి సమస్యల్లో మరణించేవారి సంఖ్య దాదాపు 80-90% ఉంటుంది. ఇంత సమస్యాత్మకమైన వ్యాధికి సరైన సమయంలో చికిత్స చేసి, రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘనత కిమ్స్ సవీరా ఆస్పత్రికే దక్కుతుంది. ప్రధాన నగరాల్లో ఇలాంటి చికిత్సలకు దాదాపు రూ.5-7 లక్షల వరకు అవుతుంది. కానీ, రోగి బంధువులు పేదలు కావడంతో దీన్ని ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా కిమ్స్ సవీరా ఆస్పత్రిలో చేశారు.
కిమ్స్ సవీరా ఆస్పత్రి గురించి
సాధారణ, లాప్రోస్కొపిక్ పద్ధతిలో చేసే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ శస్త్రచికిత్సలకు కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బంది అన్నిరకాల సమస్యలతో వచ్చిన రోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. మహ్మద్ షాహిద్ సాధారణంగా తెరిచి చేసేవి, లాప్రోస్కొపిక్ పద్ధతిలో కేవలం చిన్న గాట్లతో చేసే శస్త్రచికిత్సల్లో నిపుణులు. ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయవంతంగా చికిత్స చేయడంలో ఆయన నైపుణ్యం అపారం. రోగుల చికిత్సలో ఆస్పత్రి నిబద్ధతకు ఇదో నిదర్శనం.