రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతాం..
1 min readరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రాన్ని పారిశ్రామికరంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అహర్నిశలు కష్టపడతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉందని కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అడిగిన నిధులు, ఇతర సహకారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని శ్రీవారిని కోరినట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలని, వర్షాలు సమృద్దిగా కురిసి రైతులు సుబిక్షంగా ఉండాలన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇక కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్న హామీ నెరవేరుస్తామని తెలిపారు. కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.