వైభవంగా రాఘవుని పూర్వారాధన
1 min readశ్రీరంగం పట్టువస్త్రాలు సమర్పన
గజ వాహనంపై ఊరేగిన ప్రహ్లాద రాయలు
పుష్పాలంకరణ లో మూల బృందావనం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం లో రాఘవేంద్ర స్వామి 353 వ ఆరాధన సప్త రాత్రోత్సవలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో కనుల పండువగా జరుగుతున్నాయి. ఆరాధనోత్సవాలలో భాగంగా ముఖ్య రోజు మూడో రోజు మంగళవారం రాఘవుని పూర్వరాధన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, అలంకరణ, మహా మంగళ హారతి నిర్వహించారు. బంగారు మండపం లో మూల రాములకు పూజలు నిర్వహించారు. తమిళనాడులోని శ్రీ రంగ క్షేత్రం నుండి అర్చకులు శ్రీ రంగం ఆలయం నుండి తెచ్చిన శేషవస్త్రాలను రాఘవేంద్ర స్వామికి సమర్పించారు. అనంతరం శ్రీ రంగం ఆలయ అర్చకులు పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులకు ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. అలంకార, సంతర్పణ, పండితుల ప్రవచన, భజనలతో పవిత్రోత్సవాలు జరిగాయి. రాత్రి ప్రహ్లాద రాయలను గజ వాహనం, కొయ్య, వెండి, బంగారు, నవరత్నాల రతలపై ఆశీనులు చేసి భాజభజంత్రీల, భక్తుల హర్షధ్వనుల మద్య ప్రాకారంలో ఊరేగించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :- ఆరాధనోత్సవాలు పురస్కరించుకుని యోగీంద్ర కళాప్రాంగణంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యూఎస్ ఏ కు చెందిన విద్వాన్ రిథ్వీక్ తబల సంగీతం, మైసూరు కు చెందిన అంభారుని గురుకుల దాసవాణి వీణ సంగీతం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఏఓ మాదవ శెట్టి, మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు, వెంకటేష్ జోసి, శ్రీపతి, ఐపి నర్సింహులు, ఇంజనీర్ సురేష్ కోనపూర్, వ్యాసరాజ్, అనంత స్వామి, బిందు మాధవ మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.