నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యువ స్పందన వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నియోజవర్గ కేంద్రమైన పత్తికొండలో నెలకొన్న ప్రధాన సమస్యల గురించి శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామసభ యందు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కి స్పందన సొసైటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు మాట్లాడుతూ… పట్టణంలో రోడ్డు విస్తరణ చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని, పత్తికొండలో ప్రభుత్వ పాలిటెక్నిక్ మరియు ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఏర్పాటు చేసి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేసి పత్తికొండను ఎడ్యుకేషన్ హబుగా తీర్చిదిద్దాలని కోరారు. ముఖ్యంగా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలోని బాలికల కోసం పత్తికొండ లో మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు మరియు పత్తికొండ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగాచేసి రోగులకు మెరుగైన సేవలందిలా చూడాలన్నారు. అలాగే పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలో అధికంగా టమోటా పంటను సాగు చేస్తున్నారని, పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పత్తికొండ చుట్టుపక్కల భూమిలో అధికంగా ఫ్లోరైడ్ ఉందని, జల జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ సెంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నత చదువుకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ సభ్యులు రమేష్, శీను, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.