మట్టి వినాయకున్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
1 min readవినాయక చవితి సందర్భంగా
మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని బండి మెట్ట వీధిలో వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఆయన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు .ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాలని కోరారు. ఇందులో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకొని ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్రమాదకర రసాయనాలతో చేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయాలని ఆయన సూచించారు. అలాకాకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్రమాదకర రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల ప్రస్తుతం భూమి వేడెక్కి వరదలు, తుఫానులు, భూకంపాలు, కరువు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మానవాళి మనుగడనే ప్రశ్నించే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు .వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని వివరించారు. భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల మానవాళితోపాటు సకల జీవరాసులకు మనుగడ సాధించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యావంతులు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందులో భాగంగానే తాను వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరుకుంటూ తన వంతుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. వినాయక చవితి వేడుకలను పూర్తిస్థాయిలో మట్టి విగ్రహాలతో జరుపుకునే రోజు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.