చిన్నారుల మెదడులో కరిగిన ప్రోటీన్లు!
1 min read* డీమైలినేషన్ డిజార్డర్‌తో ఇబ్బందిపడిన చిన్నారులు
* కాళ్లు, చేతులు పనిచేయక.. చూపు తగ్గి పలు సమస్యలు
* మెదడులో ప్రోటీన్ కరిగిపోవడమే ప్రధాన కారణం
* సత్వర చికిత్సతో నయం చేసిన కర్నూలు కిమ్స్ వైద్యులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన మెదడు చాలా సున్నితమైనది. అందులో ఏ చిన్న మార్పు జరిగినా దానివల్ల పలురకాల సమస్యలు తలెత్తుతాయి. దాదాపు ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు చిన్నారులకు ఒకే తరహా సమస్యలు రావడం కొంత అరుదు. అలా ఒకే సమస్యతో వచ్చిన ముగ్గురు పిల్లలకు కిమ్స్ కడల్స్ కర్నూలు ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్టు డాక్టర్ శ్వేత రాంపల్లి తగిన చికిత్స చేసి, విజయవంతంగా నయం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆమె తెలిపారు. “ఇటీవలి కాలంలోనే వరుసగా ముగ్గురు చిన్నారులు ఒకే లాంటి లక్షణాలతో మా వద్దకు వచ్చారు. వారిలో ఒకరు ఆదోని ప్రాంతానికి చెందిన రెండేళ్ల పాప. ఆమెకు నాలుగు రోజుల పాటు జ్వరం, వాంతులు అయ్యి, ఆ తర్వాతి నుంచి ఎడమ చేయి, ఎడమ కాలు కదిలించలేకపోతోందని తల్లిదండ్రులు చెప్పారు. తీసుకొచ్చిన సమయంలో ఆమె బీపీ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత అనంతపురం జిల్లా తాడపత్రికి చెందిన ఐదేళ్ల బాబును తీసుకొచ్చారు. అతడికీ రెండు రోజుల జ్వరం తర్వాత రెండుకాళ్లు కదిలించలేకపోతున్నాడు, మూత్రవిసర్జన చేయలేకపోతున్నాడు. ఇమ్యునోథెరపీ వల్ల బాగా కోలుకున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు, మూత్ర విసర్జనలో ఇబ్బందితో రెండు కాళ్ల బలహీనత మరియు బలహీనతకు 2 వారాల ముందు రెండు పరోటిడ్ వాపు ఫిర్యాదులతో వచ్చాడు.ఈ ముగ్గురినీ ఐసీయూలో చేర్చుకుని, dr నవీన్ రెడ్డి , పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఆధ్వర్యం లొ లక్షణాలను బట్టి చికిత్స అందించడం మొదలుపెట్టాం. ఈ లోపు రక్తపరీక్షలు, మెదడుకు, వెన్నెముకకు ఎంఆర్ఐలు, మెదడు నుంచి ఫ్లూయిడ్లు సేకరించి వాటిని పరీక్షించడంతో పాటు యాంటీబాడీ పరీక్షలు, నాడీ పరీక్షలుకూడా చేయించాం. పరీక్షల ఫలితాలు చూస్తే ఈ ముగ్గురికీ డీమైలినేషన్ డిజార్డర్ లేదా న్యూరోమైలిటిస్ ఆప్టికా స్పెక్ట్రమ్ డిజార్డర్(ఎన్ఎంఓఎస్డి) అనే సమస్య వచ్చినట్లు గుర్తించాం. వెంటనే కంటి పరీక్ష చేయగా, ఐదేళ్ల బాబుకు చూపు తగ్గినట్లు తెలిసింది. వెంటనే వీళ్లకి ఇమ్యునోసప్రెసివ్ మందులను అధిక మోతాదులో ఇచ్చాం. ఫిజియోథెరపీ కూడా మొదలుపెట్టాం. దాంతోపాటు బీపీని నియంత్రించడానికి, నొప్పి నివారణకు, బ్లాడర్ సంరక్షణకు చికిత్సలు చేశాం. ముగ్గురికీ వాళ్ల లక్షణాలు క్రమంగా తగ్గాయి. మరికొంత కాలం పాటు ఇమ్యునోసప్రెసివ్ మందులు వాడాలని సూచించి డిశ్చార్జి చేశాం. ఈ చికిత్స వల్ల దుష్ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉన్నందున ముగ్గురినీ కొంతకాలం పాటు ఫాలోఅప్ చికిత్సకు రావాలని సూచించాం. తాడిపత్రికి చెందిన బాబుకు మూడు నెలల తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేశాం. దాంట్లో వెన్నుపూసలో జబ్బు తిరగబడింది (రిలాప్సె). దీనికోసం ఇమ్యునోథెరపీని నెక్స్ట్ స్టేజీకి తీసుకవెళ్లాం. ఇప్పుడు మా ఫాలో అప్ లో ఉన్నాడు.ఎన్ఎంఓఎస్ డి లేదా డీమైలినేషన్ డిజార్డర్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అది ప్రధానంగా మెదడులో నరాలు, వెన్నెముక, కంటినరాలను దెబ్బతీస్తుంది. నీరసం, కాళ్లు తిమ్మిరిబారడం, కంటిచూపు మసకబారడం, వాంతులు, ఎక్కిళ్లు, బీపీ పెరగడం, తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయి. అవి కొన్ని వారాల నుంచి నెలల వరకు ఉండొచ్చు. చికిత్స చేస్తే చాలావరకు తగ్గుతాయి. ఈ వ్యాధి చిన్నపిల్లల నుంచి 55 ఏళ్లవారి వరకు ఎవరికైనా రావచ్చు. సరైన సమయానికి చికిత్స చేయకపోతే కొందరు మరణించవచ్చు కూడా. చికిత్స తర్వాత మళ్లీ తిరగబడే (రిలప్స్) అవకాశం పెద్దవయసు వరకు ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి” అని డాక్టర్ శ్వేత రాంపల్లి తెలిపారు.