అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహార మాసోత్సవాలు…
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వుల మేరకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చాగలమర్రి మండల కేంద్రంలోని 17వ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ చంద్రకళ పౌష్టికాహార మాసోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుకూరలు కాయగూరలు పండ్లు తో పాటు చిరుధాన్యాలను ప్రదర్శనగా ఉంచి వాటి ద్వారా లభించే పోషక విలువలను గర్భవతులకు చంటి బిడ్డ తల్లులకు వివరించారు. వినాయక పండుగ సందర్భంగా చిరుధాన్యాలు ఆకుకూరలు పండ్లతో వినాయకుడి బొమ్మను ప్రదర్శించి వాతావరణ కాలుష్యంతో జీవరాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అలాగే గర్భస్థ శిశువును చిత్రం చేయకుండా, పెరగనిద్దాం, గర్భస్థ శిశువును రక్షిద్దాం, అనే నినాదంతో ఆకుకూరలు కూరగాయలు, చిరుధాన్యాలతో అలంకరించి గీసిన చిత్రం పలువురిని ఆకట్టుకున్నాయి, వినాయకుడి విగ్రహం కూడా ఆకట్టుకుంది. మట్టితో తయారు చేసిన విగ్రహాలను, ప్రకృతిలో లభించే వస్తువులతో బొమ్మలను తయారు చేసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం ద్వారా ఆహార భద్రతలో భాగంగా పౌష్టికాహారాన్ని పొందాలన్నారు. పోషకాలు కలిగిన ధాన్యాలను పదార్థాలతో పాటు పరిసర ప్రాంతాల్లో దొరికే పండ్లను వాడాలన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు తరచుగా వ్యాధులకు గురవుతూ ఉంటారన్నారు. పిల్లల్లో శారీరక మానసిక అభివృద్ధి చెందాలంటే పౌష్టికాహారం తప్పనిసరి అన్నారు. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు కలిగి ఉండే విధంగా చంటి బిడ్డ తల్లులు తగు జాగ్రత్తలు పాటిస్తూ అంగన్వాడి కేంద్రంలో వివరాలను తెలుసుకోవాలన్నారు. పిల్లలకు తల్లులకు మధ్య అనుబంధం ఏర్పడాలంటే చనుబాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలు త్రాగడం వల్ల పిల్లలకు పోషకాహారం అందరమే కాకుండా పిల్లలు ఉత్తమ తల్లులకు దగ్గర అయ్యే అవకాశం ఉందన్నారు. వ్యాధి నిరోధక టీకాలను ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా తల్లులు పిల్లలు సంబంధిత ఆరోగ్య కార్యకర్తలచే వేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పోషణ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ పథకం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, మధ్యాహ్న భోజన పథకం, కౌమార బాలికల పథకం తదితర విషయాలను సమగ్రంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఆయా సుజాత, గర్భిణీలు, చంటి బిడ్డ తల్లులు, తదితరులు పాల్గొన్నారు.