చంద్రబాబు నాయుడు పాలన అందరికీ ఆదర్శవంతం: రాష్ట్ర మంత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారని.. నీతి, నిజాయితీ, చట్టబద్దత, పారదర్శకత ఆయన ప్రత్యేకత అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ ఖండించారని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయని.. దేశవ్యాప్తంగా మద్దతు పలికారని చెప్పారు. అరెస్టు అయిన ఏ రాజకీయ నేతకు ఇలాంటి సంఘీభావం రాలేదంటే అతిశయోక్తి కాదన్నారు. 4 దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఎటువంటి మచ్చ లేని చంద్రబాబునాయుడుని వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేసి ఏడాది అయిన నేపథ్యంలో మంత్రి టి.జి భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఏ తప్పూ చేయకపోయినా అవినీతికి పాల్పడినట్లు, ఎటువంటి ఆధారం లేకపోయినా వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మంత్రి టీజీ భరత్ అన్నారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అక్రమ అరెస్టులుగా గత అయిదేళ్ల పాలన సాగిందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 70 దేశాల్లో తెలుగు ప్రజలు ఉప్పెనలా నిరసన తెలియజేశారని గుర్తు చేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్లో మొదట రూ.3 వేల కోట్ల అవినీతి అని, ఆ తర్వాత రూ.300 కోట్లు అని, ఆ తర్వాత రూ.30 కోట్లు అని.. చివరికి 3 పైసలు కూడా అవినీతికి పాల్పడినట్లు నిరూపించలేకపోయారని మంత్రి భరత్ అన్నారు.