అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
1 min readఅధిక వర్షాలకు దెబ్బతిన్న టమోటా పంటను పరిశీలిస్తున్న సిపిఐ, ఏపీ రైతు సంఘం నాయకులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. జగన్నాథం లు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కరువు పరిశీలన బృందం అధిక వర్షాలకు నీట మునిగి, పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. మంగళవారం పట్టణ శివారులోని రైతు లక్ష్మన్న పొలంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న టమోటా పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అరకొర కురిసిన వర్షాలకు రైతులు వేరుశనగ పత్తి, మిరప, టమోట, ఉల్లి, సజ్జ, జొన్న, కొర్ర తదితర పంటలను సాగు చేశారని, ఆగస్టు నెలలో 20 రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన అధిక వర్షాలకు నదీ పరివాహక ప్రాంతాల లో వందలాది ఎకరాలలో పంటలన్నీ నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి వేరుశనగ, కంది, సజ్జ, జొన్న, కొర్ర, పంటలకు ఎకరాకు 20వేల రూపాయలు,ఉల్లి, పత్తి, మిరప, టమోటా ఇతర వాణిజ్య పంటలకు ఎకరాకు 40వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు అన్నింటిని పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద ఈరన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి డి.రాజా సాహెబ్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, నియోజకవర్గ కార్యదర్శి ఉమాపతి, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు గురుదాస్, నాయకులు జోహారాపురం కాశి, నాగిరెడ్డి, భగవాన్, ఏంగిల్స్, తదితరులు పాల్గొన్నారు.