భవిష్యత్తులో కర్నూలు నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలి
1 min readకర్నూల్ నగరం భవిష్యత్తులో క్రీడా రాజధానిగా ఎదుగుతుంది.
అంతర్ పాఠశాలల హ్యాండ్ బాల్ క్రీడా పోటీలను ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భవిష్యత్తులో కర్నూల్ నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదుగుతారని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటుచేసిన అంతర్ పాఠశాలల హ్యాండ్ బాల్ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి ,జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్, క్రీడా సంఘాల ప్రతినిధులు చిన్న సుంకన్న, శ్రీను, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కర్నూల్ నగరంలో క్రీడా పోటీలు నిరంతరం నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. భవిష్యత్తులో కర్నూల్ నగరం క్రీడా రాజధానిగా ఎదుగుతుందని ఆయన తెలిపారు. కర్నూలు నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని, ఇందుకు కర్నూల్ లో జరిగే క్రీడా పోటీ నిదర్శనమని ఆయన వివరించారు .ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లో విద్యార్థుల రూపంలో తయారవుతుందని ఆయన వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, దేహదారుడ్యం పెరగడం తో పాటు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొనే సామర్థ్యం అలబడుతుందని చెప్పారు. జీవితంలో కష్టసుఖాలు, రాత్రింబవళ్లు ఎలా ఉంటాయో ఆటుపోట్లు కూడా అలాగే ఉంటాయని, క్రీడల్లో పాల్గొనడం వల్ల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడి వాటిని ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగే తత్వం అలబడుతుందని చెప్పారు. క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన వివరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణిస్తారని తెలిపారు. కర్నూల్ నగరంలో నిరంతరం క్రీడలను నిర్వహిస్తున్న జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులును ఆయన అభినందించారు. కర్నూల్ నగరంలో క్రీడల అభివృద్ధికి నిరంతరం తన వంతు సహకారం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.