PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లైంగిక దాడికి పాల్పడిన శశికుమార్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి

1 min read

జిల్లా ఎస్పీని కలిసిన ఏపీ మహిళా సమైక్య, ఎన్.ఎఫ్.ఐ. డబ్ల్యూ, ఏఐఎస్ఎఫ్ సభ్యులు

తక్షణం అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక అమీనాపేటలో గల స్వామి దయానంద సరస్వతి వసతి గృహంలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన శశి కుమార్ ని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య(ఎన్.ఎఫ్.ఐ. డబ్ల్యూ), ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేశాయి. గురువారం ఏలూరు జిల్లా ఎస్.పి. కె. ప్రతాప శివ కిషోర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ యామిని మాట్లాడుతూ ఈ వసతి గృహానికి విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, బాలల సంరక్షణ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేవని బహిర్గతమైందన్నారు.జిల్లా కేంద్రం,నగరం నడిబొడ్డున ఇంత తతంగం జరుగుతున్నా జిల్లా యంత్రాంగ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లం అయిందని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.వసతి గృహం నిర్వహిస్తున్న ఫణిశ్రీ, ఆమె భర్త శశి కుమార్ ల పై కఠినమైన సెక్షన్లు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేసి కోర్టుకు పంపాలని డిమాండ్ చేశారు.వసతి గృహాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందులో ఉంటున్న బాలికల విద్యాభ్యాసానికి,వసతికి ఆటంకాలు లేకుండా విద్యాశాఖ తగు చర్యలు చేపట్టాలన్నారు. మహిళల రక్షణ కోసం పాలకులు ఎన్నో చట్టాలు చేస్తున్నా నిందితులకు కఠిన శిక్షలు పడకపోవటమే దాడులు పెరగటానికి కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి మానవ మృగాలుగా మారుతున్నారని ధ్వజమెత్తారు. అశ్లీల వెబ్ సైట్ లను తక్షణం నిషేధం విధించాలన్నారు.లేదంటే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇతర మహిళా సంఘాలను కలుపుకొని భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. విద్య నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారడం దురదృష్టకరం ఆన్నారు. అయితే నిందితులను ఈరోజుకి అదుపులోకి తీసుకోకపోవడం జిల్లా యంత్రాంగం వైఫల్యం కనబడుతోంది అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్న తరుణంలో నిందితులను సునాయాసంగా అదుపులోకి తీసుకోవచ్చు అన్నారు. ప్రభుత్వం ఇకనైనా తక్షణం స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా వరకా శ్యామల,ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎం సాధిక్, స్త్రీ విముక్తి ఘటన టి. చిన్ని, పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి ఎస్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

About Author