PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయితీపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి,విద్యుత్ బిల్లు తగ్గించుకోండి

1 min read

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కింద తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు

టోల్ ఫ్రీ నెం. 1912

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన లాంటి పధకాన్ని అందరూ స్వాగతించవల్సిందేనని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శనివారం ఎపిఇపిడిసిఎల్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన జిల్లాస్ధాయి కమిటీ సమావేశం నిర్వహించారు.   ఈసందర్బంగా సంబంధిత అవగాహన గోడపత్రికలు, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ పధకం కింద రాయితీపై సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్ల తెలిపారు.  సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చన్నారు.  ఈ పధకం వలన గృహ వినియోగదారులకు  అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని, ఇంటి కప్పుపై కనీసం 10 చ.మీటర్లు లేదా 100 చ.అడుగుల స్థలం లో ఒక కిలోవాట్ సామర్ధ్యం కలిగిన్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.  సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ కెపాసిటీ 1 నుంచి 2 కిలో వాట్స్, 2 నుంచి 3 కిలో వాట్స్, మూడు కిలో వాట్స్ పైన ఉండే కెపాసిటీలలో సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకు రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు పథకం ద్వారా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చన్నారు. ఇది ఎంతో మంచి పథకం అని, ఒకసారి ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంవత్సరాల తరబడి దాని నుంచి లబ్ది పొందవచ్చని తెలిపారు. సౌర విద్యుత్ శక్తిని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు. ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కలిగించాలని తెలిపారు.    ఈ యూనిట్ల ను ఏర్పాటు  చేసుకోడానికి ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, తక్కువ వడ్డీ తో బ్యాంకు రుణాలు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు.  వినియోగదారునికి ప్రస్తుతం వస్తున్న బిల్లు 1000 రూపాయలు ఉంటె సోలార్ పవర్ బిల్లు  కేవలం 338  రూపాయలు వస్తుందని తెలిపారు.  సోలార్ రూఫ్ ఏర్పాటు కోసం, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.  www.pmsuryaghar.gov.in/apepdcl webite  ద్వారా  లేదా  పిఎం సూర్య ఘర్ పోర్టల్ లో  దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పధకం గురించి  గ్రామాల్లో, పట్టణాల్లో  డోర్ టు  డోర్  ప్రచారం చేయాలనీ, కరపత్రాల పంపిణీ చేయాలనీ అధికారులకు సూచించారు.  జిల్లాలో 7 గ్రామాలను మోడల్ సోలార్ రూఫ్ టాప్ తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.  అదే విధంగా నెల రోజుల్లో ఒక మోడల్ పాఠశాల,ఒక మోడల్ కళాశాలను సోలార్ రూఫ్ టాప్ కింద తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఇందుకు జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా పంచాయితీ అధికారితో సమన్వయం కావాలన్నారు.  మోడల్ సోలార్ విలేజ్ గా నిలిచే గ్రామానికి కేంద్ర ప్రభుత్వం అందించే  ఇన్సెంటివ్ పొందేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ డి. పుష్పమణి, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, ఎన్ఆర్ఇడిసి జిల్లా మేనేజరు యు. హరీష్, డిఎల్ సి సభ్యులు ఆలూరి రమేష్, ఎల్ డిఎం డి. నీలాధ్రి, విద్యుత్ శాఖ ఎఇ జెపిబి నటరాజన్, డిఇ రాధాకృష్ణ, ఎడిఇలు అంభేద్కర్, కృష్ణరాజ,త్రివాస్, ఎఇ కె. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *