PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిడ్డ ఆయాసం గుర్తించ‌లేని అంధులైన త‌ల్లిదండ్రులు!

1 min read

పుట్టుక‌తోనే బాబుకు తీవ్రమైన స‌మ‌స్య‌

క‌డుపులో ఉండాల్సిన అవ‌య‌వాలు ఊపిరితిత్తుల స్థానంలోకి!

ఫ‌లితంగా ఊపిరితిత్తులు కుచించుకుపోయి ఆయాసం

మూడున్నర నెల‌ల‌కూ త‌గినంత బ‌రువు పెర‌గ‌ని బాబు

కిమ్స్ స‌వీరా ఆస్పత్రిలో విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స‌

పల్లెవెలుగు వెబ్ అనంత‌పురం : ఆ బాబుకు తండ్రి పూర్తిగా అంధుడు. త‌ల్లికి కూడా దాదాపు 50 శాతానికి పైగా అంధ‌త్వం ఉంది. దాంతో, బాబు పుట్టిన‌ప్పటి నుంచే తీవ్రంగా ఆయాసం ఉండ‌డాన్ని పాపం ఆ త‌ల్లిదండ్రులు ఇద్దరూ గుర్తించ‌లేక‌పోయారు.  పుట్టిన మూడున్నర నెల‌ల త‌ర్వాత ఇక పాలు కూడా తాగ‌లేని ప‌రిస్థితి రావ‌డం, ఆయాసం శ‌బ్దాలు వినిపించ‌డంతో అప్పుడు బంధువుల సాయంతో అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ బాబును ప‌రీక్షించిన క‌న్సల్టెంట్ పీడియాట్రీషియ‌న్ డాక్టర్ ఎ.మ‌హేష్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు. “ఆ బాబుకు పుట్టుక‌తోనే అత్యంత తీవ్రమైన స‌మ‌స్య ఉంది. పొట్టలో ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన అవ‌య‌వాలు ఊపిరితిత్తుల స్థానంలో ఏర్పడ్డాయి. వాటిలో కాలేయంలో కొంత భాగం, ప్లీహం (స్ప్లీన్‌), కొంత‌మేర పేగులు కూడా ఉన్నాయి. దాంతో ఊపిరితిత్తుల‌కు త‌గినంత స్థలం దొర‌క్క అవి బాగా కుచించుకుపోయాయి. ఫ‌లితంగా బాబు పెర‌గాల్సినంత బ‌రువు కూడా పెర‌గ‌లేదు. పుట్టిన‌ప్పుడు 3.8 కిలోల బ‌రువు ఉండ‌గా, త‌ర్వాత మూడు నెల‌ల్లో క‌నీసం రెండు కిలోలు పెర‌గాలి. కానీ, తీసుకొచ్చేస‌రికి కేవ‌లం 4.7 కిలోలు మాత్రమే ఉన్నాడు. ముందుగా ఎక్స్ రే చేసి చూస్తే ఊపిరితిత్తుల వ‌ద్ద అంతా తెల్లగా ఉంది. దాంతో సీటీ స్కాన్ లాంటి ఇత‌ర ప‌రీక్షలు కూడా చేసి చూసిన‌ప్పుడు అస‌లు స‌మ‌స్య తెలిసింది. నిజానికి ఇవ‌న్నీ పుట్టక ముందునుంచే ఉంటాయి. బాబు పుట్టిన వెంట‌నే కూడా విప‌రీత‌మైన ఆయాసం ఉంటుంది.  అయితే దుర‌దృష్టవ‌శాత్తు తల్లిదండ్రులు ఇద్దరూ అంధులు కావ‌డంతో వారు బాబు ఆయాసప‌డ‌డాన్ని గుర్తించలేక‌పోయారు. బంధువుల్లో కూడా అప్పుడ‌ప్పుడు వ‌చ్చివెళ్లేవారు కావ‌డంతో వారూ స‌రిగా తెలుసుకోలేదు. చివ‌ర‌కు ఎవ‌రో ఒక్క బంధువు మాత్రం అప్పుడ‌ప్పుడు ఆయాసం వ‌చ్చేద‌ని చెప్పారు. బాబు ఇక్కడ‌కు రాగానే వెంట‌నే వెంటిలేట‌ర్ మీద పెట్టి, అనంత‌రం కావ‌ల్సిన వైద్య ప‌రీక్షల‌న్నీ చేసి డా. మనోహర్ గాంధీ, డా. గిరధర్ ల సహాకారంతొ చివ‌ర‌కు శ‌స్త్రచికిత్స చేయ‌డం ద్వారా అవ‌య‌వాల‌న్నింటినీ అవి ఉండాల్సిన స్థానంలో పెట్టి మ‌ళ్లీ మూసేశాం. బాబును దాదాపు మ‌రో రెండు మూడేళ్ల పాటు జాగ్రత్తగా ప‌రిశీలించుకుంటూ ఉండాలి. ఎప్పటిక‌ప్పుడు త‌గిన టీకాలు ఇప్పించ‌డం, వైద్యుల‌కు చూపించ‌డం ద్వారా.. భ‌విష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవ‌చ్చు. సాధార‌ణంగా ఇలాంటి కేసులు అప్పుడ‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి గానీ, పుట్టిన వెంట‌నే తీసుకొస్తారు. ఇలా మూడున్నర నెల‌ల వ‌య‌సు వచ్చిన త‌ర్వాత తీసుకురావ‌డం మాత్రం అరుదు. ఈ కేసులో త‌ల్లిదండ్రులు అంధులు కావ‌డం వ‌ల్ల త‌మ బిడ్డ ప‌డుతున్న బాధ వారికి తెలియ‌లేదు. దానివ‌ల్లే కొంత99 ఆల‌స్యం జ‌రిగింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాబు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు” అని డాక్టర్ ఎ.మ‌హేష్ వివ‌రించారు.

About Author