చంద్రబాబు పర్యటన నిరాశ జనకం…
1 min readసూపర్ సిక్స్ పథకాలు అమలు పై స్పష్టత ఇవ్వని చంద్రబాబు…
పెన్షన్ ల పంపిణీకి పరిమితమైన ముఖ్యమంత్రి… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య ఆరోపణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటన నిరాశాజనకంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య విమర్శించారు. బుధవారం చదువుల రామయ్య భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ పర్యటన అన్ని వర్గాల ప్రజలకు నిరాశ కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 800 మంది పోలీసు బలగాలు, హెలికాప్టర్, ఉన్నతాధికారుల ఏర్పాట్ల పరిశీలన గ్రామంలో ఆడంబరం తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీరు, పరిశ్రమల ఏర్పాటు పై ఏమాత్రం స్పష్టత లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే తో పాటు, తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గ సమస్యల ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారని, కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసం నామినేటెడ్ పదవులు సాధించుకునేందుకు ఆరాటపడ్డారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, అధికారం చేపట్టి వందరోజులు పూర్తయినా సూపర్ సిక్స్ పథకాల అమలు ఊసే లేదన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెబుతున్న చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోగా, ప్రజా సమస్యలను గాలికి వదిలేసారన్నారు. ప్రతినెల ఒకటవ తారీఖున వాలంటీర్ మాదిరి పెన్షన్ పంపిణీ చేసే ప్రక్రియను ఎంపిక చేసుకున్నారని విమర్శించారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పై ఎలాంటి నివేదికలు రాకున్నా, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముందు బహిరంగంగా తిరుపతి లడ్డు పశువుల కొవ్వుతో కల్తీ అయిందని ప్రకటన చేయడం సిగ్గుచేటు అని దుయ్యపట్టారు. తిరుపతి లడ్డు వ్యవహారంపై మతానికి సంబంధించి న మనోభావాలను దెబ్బ తీయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంత రైతులు వేరుశనగ, పత్తి, టమోటా, ఉల్లి, కంది తదితర ప్రధాన పంటలను పండిస్తారని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ కింద ఉన్న కుడి, ఎడమ కాలువ పనులను పూర్తి చేసి 106 చెరువులకు నీళ్లు నింపాలన్నారు. సంపదను సృష్టించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్, జిల్లా సమితి సభ్యులు కారన్న, సురేంద్ర కుమార్, పెద్ద ఈరన్న పాల్గొన్నారు.