PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

1 min read

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీఓలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉపాధి హామీ పథకం కింద నిర్ధేశించిన లేబర్ బడ్జెట్, హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్ పనులు, సంస్థాగత ప్లాంటేషన్ పనులు, బ్లాక్ ప్లాంటేషన్ పనులు, ఫారం పాండ్స్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులు, పశుసంపద షెడ్లు, ట్రెంచ్‌ పనుల ప్రగతి లక్ష్యాలపై డ్వామా పిడి జనార్దన్ రావు కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లస్టర్ల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి గడువులోగా పూర్తి చేయాలని ఎంపీడీవోలు, ఎపిడిలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. లేబర్ బడ్జెట్ మొబలైజేషన్ లో నందికొట్కూరు, దొర్నిపాడు, జూపాడుబంగ్లా, అవుకు, ఉయ్యాలవాడ, తదితర మండలాలు లక్ష్యసాధనలో వెనుకబడి వున్నాయన్నారు. ఉపాధి హామీ కింద అన్ని పారామీటర్లలో దిగువ స్థానంలో ఉన్నామని క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు మెరుగుపరచుకొని కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. గతవారం లక్ష్య సాధన పై తీవ్రంగా చెప్పినప్పటికీ పురోగతి కనబడడం లేదన్నారు. హార్టికల్చర్ కింద గడివేముల, దొర్నిపాడు, సంజామల, కొలిమిగుండ్ల, ప్యాపిలి, డోన్, బేతంచర్ల మండలాలు వెనకబడి ఉన్నాయని ఏదో కారణాలు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. పూర్తిచేసిన పనులపై థర్డ్ పార్టీతో విచారణ చేయిస్తామన్నారు. మోడల్ స్కూల్, కస్తూరిబా స్కూల్ ఇతర ప్రభుత్వ సంస్థల ఆవరణాలలో సంస్థాగత ప్లాంటేషన్ కింద కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. 55 ఫారం పాండ్లకు గాను 44 పూర్తి చేశారని అసంపూర్తిగా ఉన్న ఫారం పాండ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనుల్లో జీరో శాతం పురోగతి ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న పశుసంపద షెడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దినసరి సరాసరి కూలి వేతన చెల్లింపులో దిగువ స్థానంలో ఉన్నామని వేతన కూలి రేటు పెంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు.

About Author