PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవకు సంపదతో పనిలేదు.. సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు

1 min read

మానసిక వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సేవకు సంపదతో పనిలేదని కేవలం సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని ఆదిత్య విద్యా నిలయంలో కల్లూరు ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే బాషా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 60 మంది మానసిక వికలాంగులకు తనవంతుగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ గా ఉన్న ఎస్ కే భాష కేవలం ఇతరులకు సహాయం చేయాలి అన్న ఆలోచనతో ప్రతినెల దాతల సహకారంతో పింఛన్లను పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. సేవకు సంపదతో పనిలేదని, కేవలం సాటివారికి సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అన్నది ఈ ఉదంతం నిరూపిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన సూచించారు. మంచితనమే మానవత్వం… మానవత్వమే దైవత్వం అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించి ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానసిక వికలాంగులకు ప్రభుత్వం పింఛన్లను అందజేస్తున్నప్పటికీ సమాజంలోని ధనికులందరూ పేదలకు సహాయం చేసేందుకు తమ వంతుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో ధనికులకు పేదలకు మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతుందని ఇలాంటి కార్యక్రమాల ద్వారా దానిని తగ్గించవచ్చని సూచించారు. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కొంతమంది తమ ఆస్తులను సైతం పేదల కోసం త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. అట్టడుగు స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. సమాజంలో మానసిక వికలాంగులు తమను చూసుకునే కేర్ టేకర్స్ పై ఆధారపడి ఉంటారని అలాంటి వారిని గుర్తించి ప్రతినెల పింఛన్లను పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో తాను ఇప్పటికే మూడుసార్లు భాగస్వామిగా ఉన్నానని రానున్న రోజుల్లో దాన్ని కొనసాగిస్తానని ఆయన వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి భగవంతుని ఆశీర్వాదం ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లే ఎస్ కే భాష ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు. కర్నూల్ నగరంలో వైద్యుడిగా పేదలకు సేవలు అందిస్తూనే సామాజిక సేవ కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేస్తున్నానని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే బాషా, ఆదిత్య విద్యా నిలయం కరస్పాండెంట్ వాసుదేవయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author