వీధి కుక్కల బెడదను అరికడతాం…
1 min readరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
వీధి కుక్క దాడిలో గాయపడ్డ బాధితులకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలో వీధి కుక్కల బెడదను అరికడతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ అన్నారు. మంగళవారం నగరపాలక కౌన్సిల్ హాలులో ఇటీవల నగరంలోని పాతబస్తీలో వీధి కుక్క దాడిలో గాయపడ్డ 36 మంది బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని మంత్రి టి.జి భరత్ అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ గత నెల 30వ తేదీన తాను ప్రభుత్వ అతిథి గృహంలో నగరంలో వీధి కుక్కల నియంత్రణపై చర్చించినట్లు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసిందని, ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్, కమిషనర్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లానన్నారు. బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించామన్నారు. వెంటనే ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించడం జరిగిందన్నారు. కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్లు మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రెండు నెలల్లో ఈ సమస్యకు జవాబుదారీతనంతో శాశ్వత పరిష్కారం చూపాలని నగరపాలక అధికారులను ఆదేశించారు. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, ఇతర నగరాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాలని, నగరంలో పూర్తి స్థాయిలో కుక్కల బెడద నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా క్షేత్రస్థాయిలో వచ్చి అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేసి పనిచేసి, పనిచేయించారో ప్రజలందరూ చూసారన్నారు. ప్రజలకు కష్టాలు వస్తే, తాము ఎప్పుడు ముందు ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి క్రిష్ణ, ఆరోగ్యాధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ పరమేష్ పాల్గొన్నారు.