జిల్లాలోని 302 నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు పటిష్టంగా నిర్వహిస్తాం
1 min readజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న 302 నీటి వినియోగదారుల సంఘాలకు పటిష్టంగా ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడుకు వివరించారు. మంగళవారం విజయవాడ నుండి రాష్ట్రంలోని పెద్ద, మధ్య, చిన్న తరహా నీటిపారుల కింద ఉన్న నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై జిల్లా కలెక్టర్లు, జల వనరుల శాఖ అధికారులతో రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లా పరిధిలో కేసీ కెనాల్ కింద 86, ఎస్ఆర్బిసి కింద 49, తెలుగు కింద ప్రాజెక్టు కింద 47, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల కింద 120 వెరసి మొత్తం 302 సాగునీటి సంఘాలు ఉన్నట్లు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న 302 నీటి వినియోగదారుల సంఘాలకు పటిష్టంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని… నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. అక్టోబర్ 16 నుంచి నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల ప్రక్రియ మొదలు అవుతుందని, ఇందుకు సంబంధించిన షెడ్యూలు, నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లకు పంపడం జరుగుతుందన్నారు. షెడ్యూల్ విడుదల చేసిన పిదప రోజు వారి కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. నీటి వినియోగదారుల సంఘానికి 6 మంది ప్రాదేశిక సభ్యులను ఎన్నుకోవాలని, వారి నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎంపిక చేసుకోవాలన్నారు. నీటి సంఘానికి అధ్యక్షున్ని ఎగువ ప్రాంతాల నుండి ఎన్నుకోబడినట్లయితే, ఉపాధ్యక్షుడు దిగువ ప్రాంతాల నుండి మరియు వైస్-వెర్సా నుండి తప్పక ఎంపిక చేయబడాలని మంత్రి పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలపై తగు సూచనలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డిఓ మల్లికార్జున రెడ్డి, జల వనరుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.