PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సమాయత్తం కండి

1 min read

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్ని మండలాల తాసిల్దారులు, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగునీటి సంఘాల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, డిఆర్ఓ పద్మజ, నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ సుబ్బరాయుడు, కెసి కెనాల్ ఈఈ ప్రకాష్ రెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఈఈ రఘురాంరెడ్డి, ఎస్సార్ బీసీ ఎస్ఈ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఈనెల 16 నుండి జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు ప్రారంభమై నవంబర్ 24వ తేదీ వరకు వివిధ దశలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో  స్థిరీకరించిన ఆయకట్టుదారుల ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని మండల తాసిల్దారులను, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తెలుగు గంగ ప్రాజెక్టు కింద 18 మండలాల్లో స్థిరీకరించిన 1,31,079 ఎకరాలకు సంబంధించి 47 సాగునీటి వినియోగదారుల సంఘాలు, కేసీ కెనాల్ కింద 18 మండలాల్లో స్థిరీకరించిన ఆయకట్టు 1,51,592 ఎకరాలకు సంబంధించి 47 సాగునీటి వినియోగదారుల సంఘాలు, ఎస్సార్ బీసీ కింద 9 మండలాల్లో స్థిరీకరించిన ఆయకట్టు 1,51,925 ఎకరాలకు సంబంధించి 50 సాగునీటి వినియోగదారుల సంఘాలు, మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద 18 మండలాల్లో స్థిరీకరించిన ఆయకట్టు 43,200 ఎకరాలకు సంబంధించి 105 సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి స్థిరీకరించిన ఆయకట్టును బట్టి ప్రాదేశిక నియోజకవర్గాల వర్గీకరణ ప్రక్రియను చేపట్టాలన్నారు.ఈనెల 16 న షెడ్యూల్  వెలవడనున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రాజెక్టుల వారీగా సంఘాల ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో సాగునీటి సంఘం నుండి 6 నుండి 8 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుందనీ, ఎన్నికైన సాగునీటి సంఘాల సభ్యులు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారన్నారు. ఇందుకు సంబంధించి డిఆర్ఓ ఎ.పద్మజ, ఇరిగేషన్ ఎస్ఈ వరప్రసాద్ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లుగా డోన్ ఆర్డిఓ మహేశ్వర్ రెడ్డి, ఏఈఈ విజయ్ కుమార్ ను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

About Author