PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి బాలిక తప్పకుండా చదువుకోవాలి

1 min read

ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత

బాల్య వివాహాలు చేసుకోకండి

చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి

జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సమాజంలో ప్రతి  బాలిక చదువుకోవాలని, ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  సమగ్ర మహిళా శిశు అభివృద్ధి సంస్థ  ఆధ్వర్యం లో  నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో బేటి పడావో అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తోందని తెలిపారు..ఆడపిల్లలను రక్షించుకోవాలని,  మంచి చదువులు చదివించాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.  మాతృ గర్భం నుంచి ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితి నుంచీ  ప్రతి దశలో వారిని కాపాడుకుంటూ, చదువుతో మంచి భవిష్యత్తును అందించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.సమాజంలో నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అనేక మంది మహిళలు ఉన్నత పదవుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాగే మన దేశ రాష్ట్రపతి ఒక మహిళ కావడం గర్వకారణమని కలెక్టర్ తెలిపారు.. అయితే ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఆడపిల్ల పట్ల కొంత వివక్ష ఉందని,  అందువల్లనే   బేటి బచావో బేటి పడావో పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు.. శిశు గృహ, బాలసదన్, మిషన్ వాత్సల్య వంటి పథకాల ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాధ పిల్లలను సంరక్షించడంతోపాటు  వారికి విద్యను అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కలెక్టర్ వివరించారు.ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. ఆడపిల్లలు ఎవరైనా ఆపదలో ఉంటే 1098 కి ఫోన్ చేస్తే సహాయం అందుతుందన్నారు..అలాగే  మహిళలు ఆపదలో ఉంటే   181 కు, పోలీసుల సహాయం కోసం 100 కు, జిల్లా బాలల మరియు మహిళల రక్షణాధికారి 9440814461 కి ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు..ఆడపిల్లలు  ఏ విధంగా రక్షణ లేకపోయినా  ఈ నంబర్లకు ఫోన్ చేసి సహాయాన్ని పొందాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఈ ఫోన్ నంబర్లను  అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అలాగే బాలికలు మహిళలు చట్టాల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. పిసిఎన్డిటి, బాల్యవివాహాల నిరోధక చట్టాలు ఎన్నో ఉన్నాయని, వీటి గురించి తెలుసుకుని వారి హక్కులను పరిరక్షించుకోవాలని సూచించారు..గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసి, లింగ్ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయడం, బాల్య వివాహాలు చేయడం నేరం అని, వీటికి చట్టాలు, శిక్షలు ఉన్నాయని, వీటి గురించి తెలుసుకోవాలని కలెక్టర్ వివరించారు.. బాల్య వివాహాల వల్ల  చిన్న వయసులోనే తల్లి కావడం వల్ల తల్లీ, బిడ్డ లకు ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.. అందువల్ల బాలికలు బాల్య వివాహాలు చేసుకోవద్దని, బాగా చదువుకుని అన్ని విధాలా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో రాణించగల సామర్థ్యం ఉందన్నారు..బాలికలు  విద్య పై దృష్టి పెట్టి, అభివృద్ధిని సాధించేందుకు పోటీ తత్వంతో  ముందడుగు వేయాలని సూచించారు..  ప్రస్తుత సమాజంలో మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని,  ఈ అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని సామాజికంగా,ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధిని సాధించాలని సూచించారు.. బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండి తమకు తాము రక్షణ పొందాలని జేసీ సూచించారు.ఐసిడిఎస్  పిడి వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.. న్నారు. బాలికల సంరక్షణకు కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస ఆచారి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది, బాలికలు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *