PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరు నెల‌ల బాబుకు కిడ్నీల్లో రాళ్లు….

1 min read

* కుడి కిడ్నీలో రెండు, ఎడ‌మ కిడ్నీలో మ‌రో రెండు

* ల‌క్ష మందిలో ప‌ది మందికే ఇలాంటి స‌మ‌స్య‌

* ఆంధ్రప్రదేశ్‌లో ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి

* పెద్ద ప‌రిమాణంలో రాళ్లతో ఆగిపోయిన మూత్రం

* ఎండోస్కొపిక్ విధానంలో తొల‌గించిన క‌ర్నూలు కిమ్స్ వైద్యులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  చిన్న పిల్లల‌కు అవ‌య‌వాలు చాలా చిన్నగా ఉంటాయి. అందులోనూ ఆరు నెల‌ల పిల్లలంటే అత్యంత సున్నిత‌మైన అవ‌య‌వాలు క‌లిగి ఉంటారు. కానీ, ఆ వ‌య‌సులో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ‌డం అంటే.. చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి. అలాంటిది రెండు కిడ్నీల్లోనూ రెండేసి రాళ్లు, అవీ పెద్ద ప‌రిమాణంలో ఏర్పడ‌డంతో ఆ బాబుకు మూత్రవిస‌ర్జ‌న ఆగిపోయి, పొట్ట ఉబ్బిపోయింది. ఇంత చిన్నవ‌య‌సులో రెండు కిడ్నీల్లో రెండేసి రాళ్లు ఏర్పడ‌డం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తొలిసారి. ల‌క్ష మందిలో కేవ‌లం ప‌ది మందికే ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఆ బాబుకు ఎండోస్కొపిక్ విధానంలో మొత్తం నాలుగు రాళ్లను తొల‌గించి క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఊర‌ట క‌ల్పించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్పత్రికి చెందిన సీనియ‌ర్ క‌న్సల్టెంట్ యూరాల‌జిస్టు, ఆండ్రాల‌జిస్టు, లాప్రోస్కొపిక్, ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జన్ డాక్టర వై.మ‌నోజ్ కుమార్ తెలిపారు. “ఆరు నెల‌ల బాబుకు మూత్రవిస‌ర్జన కాక‌పోతుండ‌డం, పొట్ట బాగా ఉబ్బిపోవ‌డంతో బాబు త‌ల్లి, మేన‌మామ క‌లిసి ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాబు తండ్రి సైన్యంలో ప‌నిచేస్తుండ‌డంతో వారిద్దరు వ‌చ్చారు. ప‌రీక్షించ‌గా బాబుకు రెండు కిడ్నీల‌లో రాళ్లు ఏర్పడి, అప్పటికే దాదాపు కిడ్నీ ఫెయిల్యూర్ ప‌రిస్థితి ఏర్పడింది. దాంతో ముందుగా స్టెంట్లు అమ‌ర్చాం. దానివ‌ల్ల కిడ్నీలు మ‌ళ్లీ మామూలు స్థితికి చేరుకున్నాయి. ఆ త‌ర్వాత ముందుగా ఒక‌వైపు, త‌ర్వాత మ‌రోవైపు కిడ్నీల్లోని రాళ్ల‌ను తొల‌గించాల‌ని నిర్ణయించాం. ఎడ‌మ‌వైపు కిడ్నీలో 11 మిల్లీమీట‌ర్లు, 9 మిల్లీమీట‌ర్ల రాళ్లు ఉండ‌గా, కుడివైపు కిడ్నీలో 9 మిల్లీమీట‌ర్లు, 7 మిల్లీమీట‌ర్ల చొప్పున రాళ్లు ఉన్నాయి. నిజానికి ఇవి పెద్దవ‌య‌సువారిలో ఏర్పడినా పెద్ద రాళ్లనే చెప్పాలి. వీటిలో ముందుగా ఒక‌వైపు కిడ్నీకి ఒక‌సారి, రెండోవైపు కిడ్నీకి ఇంకోసారి ఎండోస్కొపిక్ ప‌ద్ధతిలో కుట్లు లేకుండా లేజ‌ర్ ద్వారా, ముఖ్యమైన అవ‌య‌వాల‌కు గాయాలు కాకుండా అత్యంత జాగ్రత్తగా రాళ్లు తొల‌గించాము. ఇప్పుడు స్టెంట్లు కూడా తొల‌గించాము. ఆ త‌ర్వాత మెట‌బాలిక్ ప‌రీక్షలు, కొన్ని ర‌క్త ప‌రీక్షలు చేయాల్సి ఉంటుంది. పెద్ద వ‌య‌సు వారిలో కంటే చిన్న పిల్లల్లో కిడ్నీల్లో రాళ్లు మ‌ళ్లీ మ‌ళ్లీ ఏర్పడే అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల ఈ ప‌రీక్షల‌ను బ‌ట్టి చూసి అవ‌స‌ర‌మైతే కొన్ని మందులు వాడాలి. ఇంత చిన్న‌వ‌య‌సు పిల్ల‌ల‌కు అస‌లు రాళ్లు ఏర్పడ‌డ‌మే చాలా అరుదు. అందులోనూ ఏడు నెల‌ల వ‌య‌సులో రెండు కిడ్నీల‌కూ శ‌స్త్రచికిత్స చేసి రాళ్లు తొల‌గించ‌డం కూడా అత్యంత అరుదు. క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక స‌దుపాయాలు, అనుభ‌వ‌జ్ఞులైన నిపుణుల కార‌ణంగానే ఇలాంటివి కూడా చేయ‌గ‌లుగుతున్నాం” అని డాక్టర్ మ‌నోజ్ కుమార్ వివ‌రించారు.

About Author