ట్రాన్స్ జెండర్ కు సమాన అవకాశాలు కల్పిస్తాం
1 min readట్రాన్స్ జెండర్ సమస్యలను పరిష్కరిస్తాం
ట్రాన్స్ జెండర్స్ కు కలెక్టర్ భరోసా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: సమాజంలో పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో ట్రాన్స్ జెండర్ ల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు పురుషులు, స్త్రీలతో సమాన అవకాశాలు కల్పిస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 240 మంది పెన్షన్ పొందుతున్నట్లు, వైద్య శాఖ నివేదికల్లో 690 మంది ఉన్నట్లు, ఎన్జీవో సంస్థలు వెయ్యి మంది ఉన్నట్లు రకరకాల గణాంకాలు చెప్తున్నారని… నిజమైన ట్రాన్స్జెండర్ల జాబితాను సమర్పించాలని సంబంధిత ఎన్జీవో సంస్థలను కలెక్టర్ సూచించారు. ట్రాన్స్ జెండర్లు ఏ ఏరియాలో ఉన్నారు, ఎంతమందికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు ఉన్నాయి, ప్రస్తుతం వారు చేస్తున్న పనులు, వారితోపాటు జీవిస్తున్న వ్యక్తులు తదితర వివరాలను వారం రోజుల్లో ఇవ్వాలని సంబంధిత అధికారులు, ఎన్జీవో సంస్థలను కలెక్టర్ ఆదేశించారు. భారత ప్రభుత్వం జారీచేసిన ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని 2019లో జారీ చేసిన చట్టం మేరకు భిక్షాటన, అసభ్య ప్రవర్తన, వ్యభిచారం మూడు అంశాలను పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వం తరఫున లబ్ధి చేకూర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు.సమాజంలో ట్రాన్స్ జెండర్లను వేరు చేసి మనోభావాలు దెబ్బతీయడం ఉద్దేశం కాదని మీ అభ్యున్నతికి వికలాంగుల శాఖ పనిచేస్తుందని కలెక్టర్ వివరించారు. గతంలో తాను పనిచేసిన జిల్లాలలో ట్రాన్స్ జెండర్ ల సమస్యలు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులతో వాళ్లు నివసిస్తున్న కాలనీలకు వెళ్లి లబ్ధి చేకూర్చామన్నారు. ఇదే తరహాలో జీఓలోని నిబంధనల మేరకు ట్రాన్స్ జెండర్లకు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం తరఫున భరోసా కల్పిస్తామన్నారు.
ట్రాన్స్ జెండర్ లందరూ ఐక్యమత్యంగా ఉండి మీ హక్కులను మీరు సాధించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మూడు నెలలకు ఓసారి సమావేశం నిర్వహించి ట్రాన్స్ జెండర్ల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రైస్ ఫాతిమా, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, అడిషనల్ డిఎంహెచ్వో శారదాబాయి, సివిల్ సప్లైస్ అధికారి వెంకట్రాముడు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సబిహా పర్వీన్, ఎంప్లాయిమెంట్ అధికారి సోమ శివారెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.