గర్భిణీ మృతి కేసులో..ముద్దాయిల అరెస్ట్
1 min read

రక్ష ఆస్పత్రిపై కేసు నమోదు..వివరాలు వెల్లడించిన సీఐ సుబ్రహ్మణ్యం..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఈనెల 30వ తేదీన 4 నెలల గర్భవతి గుజ్జుల శ్రీవాణి(25) మృతి చెందిన కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం సాయంత్రం సీఐ తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన శ్రీవాణికి మొదటగా ఇద్దరు ఆడపిల్లలు ఆ తర్వాత గర్భవతి దాల్చడంతో కర్నూలు రక్ష ఆస్పత్రిలో స్కానింగ్ చేయించడంతో ఆడపిల్ల అని తేలింది.29వ తేదీన నందికొట్కూరు పట్టణంలోని వీరభద్ర క్లినిక్ లో ఆర్ఎంపీ డాక్టర్ గీతారాణి అబార్షన్ చేశారు.మరుసటి రోజు ఉదయం అబార్షన్ వికటించి శ్రీవాణి తీవ్ర రక్తస్రావంతో మరణించిన సంగతి తెలిసిందే.శ్రీవాణి తల్లి శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.ఈ కేసులో ముద్దాయిలు అయిన భర్త లోకేష్,అత్త నాగేంద్రమ్మ, ఆర్ఎంపీ గీతారాణి లను అరెస్టు చేసి నందికొట్కూరు జె ఎఫ్ సీఎం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. శ్రీవాణికి స్కానింగ్ చేసిన కర్నూలు రక్ష ఆసుపత్రి స్కానింగ్ టెక్నీషియన్ శేఖర్, ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు అంతేకాకుండా వీటిలో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందనేది సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని ఆ తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పాత్రికేయులకు వివరించారు.

