ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి
1 min readపట్టణ నిరాశ్రయ వసతి గృహంలో ఉన్న వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రస్తుతం ఉన్న సీజన్ లో ప్రతి ఒక్కరూ దోమ కాటుకు గురికాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. కర్నూల్ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పట్టణ నిరాశ్రయ వసతి గృహంలో ఉన్న వృద్ధులకు ఆయన దోమకాటుకు గురి కాకుండా అవసరమైన దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సీజన్లో దోమలు అధికంగా ఉంటాయని, వాటి కాటుకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దోమ కాటుకు గురైతే మలేరియా, డెంగ్యూ, ఎన్సేఫలైటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. పట్టణ నిరాశ్రయ వసతి గృహంలో ఉన్న వృద్ధుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రానున్న కాలంలో వారికి దోమతెరలు, పాద రక్షలు వంటి వాటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే వారికి పౌష్టిక ఆహారం అవసరం ఎంతో ఉందని, తక్కువ ధరలో పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ధనికులు.. పేదల మధ్య వ్యత్యాసం ఎంతో కనపడుతుందని, దానికి తగిన కారణాలు కనపడడం లేదని వివరించారు. పేదలు… ధనికుల మధ్య తేడాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. షైనింగ్ ఇండియా..ం సఫరింగ్ ఇండియా ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సఫరింగ్ ఇండియా నుంచి ప్రతి ఒక్కరిని విముక్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పట్టణ నిరాశ్రయ వసతి గృహం లోని పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూల్ నగరంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూనే తన వంతు సహాయంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు.