వైద్య సిబ్బంది జవాబుదారీతనం, అంకితభావంతో పనిచేయాలి
1 min readజిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం
వైద్యుల సేవలోపం కారణంగా ఎటువంటి మరణం సంభవించకూడదు
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రూ.4 కోట్లతో ఆధునిక వైద్య పరికరాలు అందించేందుకు చర్యలు
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమీక్ష*
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించే దిశగా తీరదిద్దెందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వైద్య సిబ్బంది కూడా అదే స్థాయిలో జవాబుదారీతనం, అంకితభావంతో వైద్య సేవలందించేలా పనిచేయాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఆసుపత్రి వైద్యాధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అత్యవసర పరిస్థితిలో రోగులు వస్తుంటారని, వారికి వెంటనే చికిత్స అందేలా వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. వైద్య సేవల లోపం కారణంగా ఎటువంటి మరణం సంబవించకుండా డాక్టర్లు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. సామాన్య ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ముఖ్యమంత్రి ఆశయాల మేరకు వైద్యసిబ్బంది ప్రజలకు అంకితభావంతో సేవలందించాలన్నారు. ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి , వైద్య సిబ్బంది కొరత, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటుపై తాను దృష్టి సారించానని, ఇప్పటికే నాలుగుకోట్ల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాననన్నారు. ఇంకా అవసరమైతే సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఒక్క పేదవాడు తనకు వైద్య సేవలు అందలేదని ఫిర్యాదు చేయకుండా వైద్యాధికారులు తమ వృత్తికి వన్నె తెచ్చే రీతిలో రోగులకు సేవలందించాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం ద్వారా ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దెందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాన సమస్యలైన వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, అత్యవసర వైద్య విభాగాలలో సిబ్బందిని డెప్యూటేషన్ పై నియమించాలని అధికారులను ఆదేశించారు. వైద్య చికిత్సకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలందించే విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను రోగుల సౌకర్యాలు, ఆసుపత్రి అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి ఆవరణలో రోగుల సహాయకులకు వెయిటింగ్ హల్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించే బ్లడ్ బ్యాంకు నుండి బ్లడ్ యూనిట్లు ఉచితంగా అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో, ఆవరణలో, టాయిలెట్ లలో పూర్తిస్థాయిలో పారిశుధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రజాప్రతినిధులుగా తాము పూర్తి సహకారం అందిస్తామని, ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపొందించే కార్యక్రమంలో భాగంగా 125 ఆధునిక బెడ్స్ అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిని అధికారులు, వైద్య సిబ్బంది సమిష్టి కృషితో పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేలా ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తామని, అదే సమయంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలందించడంలో వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో ఇంచార్జి డిఎంహెచ్ఓ డా. నాగేశ్వరరావు, జిల్లా ఆసుపత్రిసేవల సమన్వయాధికారి డా.బి.పాల్ సతీష్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సిహెచ్. సుధాకర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎం. శశిధర్, ప్రభృతులు పాల్గొన్నారు.