రెండో సర్కిల్ ఉండాలని హోంమంత్రి కి వినతి
1 min readటిడీపీ నాయకులపై అక్రమ కేసులపై హోంమంత్రి దృష్టికి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు ప్రాంతంలోనే ఇంకో సర్కిల్ కార్యాలయం ఉండాలని కోరుతూ నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల పూడి అనిత ను ఎమ్మెల్యే కలిసి సర్కిల్ కార్యాలయం గురించి చర్చించారు.నందికొట్కూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు వీటిలో నందికొట్కూరు,పగిడ్యాల, జూపాడుబంగ్లా,మిడుతూరు మండలాలకు నందికొట్కూరు పట్టణంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సీఐ)కార్యాలయ పరిధిలో ఈ మండలాలు ఉన్నాయి.కానీ మిగతా రెండు పాములపాడు,కొత్తపల్లి మండలాలకు నందికొట్కూరు కాకుండా ఆత్మకూరు పట్టణంలో ఉన్న సీఐ కార్యాలయ పరిధిలోకి వస్తాయి.నియోజకవర్గం మాదే అయినప్పటికీ ఆ రెండు మండలాల ప్రజలు ఆత్మకూరు లో సీఐ కార్యాలయం ఉన్నందున చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆత్మకూరులో కాకుండా మా నియోజకవర్గంలోనే జూపాడుబంగ్లా పాములపాడు కొత్తపల్లి మండలాలను కలిపి ఒక సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఈ మధ్యనే నందికొట్కూరు పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. అందుకు గాను గురువారం అమరావతిలోని హోంమంత్రి అనిత కార్యాలయంలో ఎమ్మెల్యే కలసి జూపాడుబంగ్లా,పాములపాడు,కొత్తపల్లి మండలాలకు ఇంకో సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.అంతే కాకుండా గత ప్రభుత్వంలో టిడీపీ నాయకులపై,కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల గురించి ఎమ్మెల్యే మరియు పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.తర్వాత నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి వివిధ శాఖల మంత్రులను కలిసి సమస్యల గురించి విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో చెరుకుచెర్ల గుండం హరి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు.