ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలి.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min readటిజివి సంస్థల తరుపున మున్సిపాలిటీకి హైపో ద్రావణం ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి
దోమల నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం
నగరపాలక అధికారులతో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ సమీక్ష
కార్పొరేటర్లు తెలిపిన సమస్యలకు ప్రాధాన్యమివ్వాలి.. మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో దోమల సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు తమ టిజివి సంస్థల తరుపున హైపో ద్రావణాన్ని నగరపాలక సంస్థకు ఉచితంగా అందజేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. హైపో ద్రావణాన్ని నగరవీధుల్లో పిచికారీ చేయాలని చెప్పారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సత్వరం పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో నగర అభివృద్ధి పనులపై నగరపాలక అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముందుగా సచివాలయ అడ్మిన్లతో మంత్రి సమావేశమయ్యారు. సచివాలయ సిబ్బంది స్థానిక కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్ర స్థాయిలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఏవైనా కష్టతరమైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకోరావాలని సూచించారు. అనంతరం అధికారులతో పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ముందుగా గత నెల 30న నిర్వహించిన సమీక్షకు సంబంధించిన పనుల పురోగతిని మంత్రికి అధికారులు వివరించారు. అనంతరం తాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి ఇంటికి పగటి సమయంలో నీరు అందించే లక్ష్యానికి సంబంధించి పురోగతి, చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. పార్కు స్థలాల అన్యాక్రాంతం, రహదారుల ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. బంగారుపేట వెనుక రహదారి విస్తరణ పనులు వేగం పెంచాలన్నారు. గార్గేయపురం డంప్‌యార్డు వద్ద మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ప్లాంట్ నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్న మంత్రి, వాటి నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య తాత్కాలిక కార్మికుల పనితీరు, హాజరుపై మంత్రి ఆరా తీశారు. ప్రజల నుండి ఫిర్యాదులు లేకుండా పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలన్నారు. అలాగే పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అర్బన్ డెవలప్మెంట్‌పై మంత్రికి అధికారులు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అలాగే ట్రాఫిక్ రద్దీ నివారణకు రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బళ్ళారి చౌరస్తా నుండి బస్టాండ్ వద్దకు ఎస్.ఏ.పి. క్యాంపు మీదుగా రహదారి నిర్మాణానికీ సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఐ.జి స్థాయిలో ఉందని, త్వరలో అన్ని పూర్తై పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల వద్ద మలుపు విస్తరణకు సంబంధించి ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలిస్తారని, దుకాణదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామన్నారు. కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట వరకు రహదారి విస్తరణకు సంబంధించి స్థల బాధితులకు న్యాయం చేసి పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, విధులకు గైర్హాజరై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ఏ ప్రాంతానికి ఎంత నీరు సరఫరా అవుతుందనే సమాచారం ప్రస్తుతం లేదని, అందుకోసం విజయవాడ కార్పొరేషన్ చేపట్టిన విధంగా స్కాడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ఆనంద్ థియేటర్ ఎదుట హంద్రీ నది తీరాన, బుధవారపేట ప్రాంతాల్లో పార్కుల నిర్మాణానికి అడుగులు వేస్తున్నామన్నారు. అన్యాక్రాంతం కాబడిన పార్కులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని, అభివృద్ధి చేస్తామన్నారు. వీధికుక్కలకు ఆపరేషన్లు చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.సమావేశంలో కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, అదనపు కమిషనర్ ఆర్.జి.వి క్రిష్ణ, ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్.ఈ. రాజశేఖర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, డిసిపి సంధ్య, సూపరింటెండెంట్ సుబ్బన్న, రామకృష్ణ, టిడ్కో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.