PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిక్కారెడ్డి చూపు..మంత్రాలయం వైపు..

1 min read

 జిల్లా అధ్యక్షుడి వైఖరితో …  తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి..

మంత్రాలయం ఓటమిపై సీఎం ఫైర్​

వైసీపీకి మంత్రాలయం అభ్యర్థి సహకరించాడనే ఆరోపణలు

అందుకే ఓటమి పాలంటూ నివేదిక

తిక్కారెడ్డికి ఇచ్చి ఉంటే… గెలిచేదేమో…!

 ఈ విషయంపై ఐవీఆర్  సర్వే చేపట్టనున్న అధిష్ఠానం..?

జిల్లా అధ్యక్ష పదవికి తిక్కారెడ్డి తప్పుకుంటే….బీసీలకే…?

ఆదోని నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ మీనాక్షి నాయుడు, కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్​ కు దక్కే అవకాశం ?

కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కూటమి ప్రభుత్వం అన్ని స్థానాల్లో భారీ విజయం సొంతం చేసుకుంది. 2024  సార్వత్రిక ఎన్నికల్లో 175 కి గాను 164 స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. పరాజయం పాలైన 11 స్థానాల్లో మాత్రం టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఆయా స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన వారు ఓటమికి బలమైన కారణాలు ఉండొచ్చు. కానీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఓటమికి  గల కారణాలను  సీఎం చంద్రబాబు నాయుడు విచారణ చేపడుతున్నారు. అక్కడ నియోజకవర్గ ఇన్​చార్జ్​గా ఉన్న తిక్కారెడ్డికి కాకుండా వాల్మీకి వర్గానికి చెందిన రాఘవేంద్ర రెడ్డికి సీటు ఇవ్వడంతో ఘోర పరాజయం పాలైందని ఆ నియోజకవర్గ ప్రజలు, తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. కాగా మంత్రాలయం ఓటమిపై సీఎం చంద్రబాబు నాయుడు ఐవీఆర్​ సర్వేతో విచారణ చేపడుతున్నట్లో విశ్వసనీయ సమాచారం.

 విమర్శలెందుకు…!

వైసీపీ కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో టీడీపీ పాగా వేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలతో ఘోర పరాజయం పాలైన వైసీపీ… రెండు స్థానాల్లో మాత్రమే తక్కువ మెజార్టీతో గెలిచింది. అందులో మంత్రాలయం ఒకటి. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి కి సహకరించాడని, అందుకే ఓటమి పాలైందని తెలుగు తమ్ముళ్ల విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అదే సీటు తిక్కారెడ్డి కి ఇచ్చి ఉంటే… గెలిచేదేమో అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి కాక ముందే మంత్రాలయం అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వైఖరిపై విమర్శలు రావడం… జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న తిక్కారెడ్డి  ఆ  నియోజకవర్గ ఇన్​చార్జ్​ పదవికి ఆసక్తి చూపుతుండటంతో అధిష్ఠానం పునరాలోచనలో పడింది. దీనికితోడు అధ్యక్ష పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడంలేదనే ఆరోపణలు తిక్కారెడ్డిపై వినిపిస్తున్నాయి.

తిక్కా రెడ్డి తప్పుకుంటే….బీసీలకే..!

మంత్రాలయంలో బలమైన క్యాడర్​ ఉన్న తిక్కారెడ్డి 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కానీ 2024లో ఆయనకు ఇచ్చి ఉంటే గెలిచేదేమోనని టీడీపీ జెండా ఎగరవేసేదేమోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.   ఎన్నికల ముందు  తిక్కారెడ్డిని బుజ్జగించి… జిల్లా అధ్యక్ష పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తిక్కారెడ్డి  తమకు న్యాయం చేయడంలేదని టీడీపీ కార్యకర్తలు, నాయకులు  అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  

 జిల్లా అధ్యక్ష పదవి..బీసీకేనా…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అసంతృప్తివాదులకు నామినేటెడ్​ పదవులు ఇచ్చి… పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తిక్కారెడ్డి పదవి నుంచి తప్పుకుంటే… ఈ సారి బీసీలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఓసీకి ఇవ్వడంతో… కర్నూలును బీసీలకు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో పడినట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ విధేయుడు,  సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు… సీనియర్​ నాయకుడైన ఆదోని నియోజకవర్గ ఇన్​చార్జ్​ మీనాక్షి నాయుడుకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చ జరుగుతోంది. లేదా కర్నూలు నగర అధ్యక్షుడు, మంత్రి టీజీ భరత్​ గెలుపునకు కీలకపాత్ర పోషించిన నాగరాజు యాదవ్​ కు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.  అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా… తమకు సమ్మతమేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *