PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఐఎన్‌యూ ఆధ్వర్యంలో హైపర్‌టెన్షన్ క్లినిక్ ప్రారంభం

1 min read

నాలుగో వార్షికోత్సవం సంద‌ర్భంగా ఏర్పాటు

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్​: ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) హైటెక్ సిటీ నాలుగో వార్షికోత్సవం సంద‌ర్భంగా కొత్తగా హైప‌ర్‌టెన్షన్ క్లినిక్ ప్రారంభించారు. అధిక ర‌క్తపోటుకు, దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధికి, గుండె స‌మ‌స్య‌ల‌కు సంబంధంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ హైప‌ర్‌టెన్షన్ క్లినిక్ ఒక కీల‌క ముంద‌డుగు.అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న రోగుల జీవన నాణ్యతను పెంచడం, అది నియంత్ర‌ణ‌లో లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే మూత్రపిండాల స‌మ‌స్యలు, ఇత‌ర ప్రమాదాల‌ను త‌గ్గించ‌డం ఏఐఎన్‌యూ హైటెక్ సిటీ శాఖ ల‌క్ష్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన ప్రకారం, అధిక రక్తపోటు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. దీని ల‌క్షణాలు త్వర‌గా బ‌య‌ట‌ప‌డ‌వు కాబట్టి చాలామందికి అది ఉందని తెలియదు.హైప‌ర్‌టెన్షన్ క్లినిక్ ప్రారంభం సంద‌ర్భంగా ఏఐఎన్‌యూ హైటెక్ సిటీ శాఖ డైరెక్టర్, సీనియ‌ర్ క‌న్సల్టెంట్ యూరాల‌జిస్టు డాక్టర్ దీప‌క్ రాగూరి మాట్లాడుతూ, “ఈ రోజుల్లో వైద్యంలో అత్యంత ఆందోళనకరమైన, సవాలుతో కూడిన అంశం జీవనశైలి వ్యాధుల పెరుగుదల.  అధిక ర‌క్త‌పోటు కూడా అలాంటి స‌మ‌స్యే. ఇటీవ‌లి కాలంలో ఇది బాగా పెరిగిపోతున్న విష‌యం మ‌నం గ‌మ‌నిస్తున్నాం. ప్రారంభ‌ద‌శ‌లోనే దీని నిర్ధార‌ణ జ‌రిగి, త‌గిన చికిత్స అందిస్తే.. ర‌క్త‌పోటు ఎక్కువ కాకుండా చూసుకోవ‌చ్చు. అది ఎక్కువ‌కాలం పాటు కొన‌సాగితే మూత్రపిండాలు దెబ్బతింటాయి. “హైపర్ టెన్షన్ క్లినిక్” వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ముప్పు పొంచి ఉన్న ప్ర‌జ‌ల‌కు ర‌క్తపోటు విష‌యంలో ప‌రీక్షలు చేయ‌డం, ముందుగానే నిర్ధారించి, వారికి త‌గిన చికిత్స అందించ‌డం. అనియంత్రిత రక్తపోటు వ‌ల్ల ప్రమాదాలలో ఒకటి మూత్రపిండాల నష్టం అని ప్రజలకు అవగాహన కల్పించాలని మేము భావిస్తున్నాము. ఇది చాలా మందికి తెలియదు” అని చెప్పారు.ఏఐఎన్‌యూ హైటెక్ సిటీ బ్రాంచి సీనియ‌ర్ క‌న్సల్టెంట్ నెఫ్రాల‌జిస్టు డాక్టర్ కె. క్రాంతికుమార్ మాట్లాడుతూ, “హైపర్ టెన్షన్ క్లినిక్స్ అనేది సమాజంలో హైబీపీ ముప్పును ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. ఇది ప్రారంభ‌ద‌శ‌లోనే రోగ నిర్ధారణ, రక్తపోటుతో సంబంధం ఉన్న సమస్యలను నివారించడంపై దృష్టి పెడుతుంది” అన్నారు. మూత్రపిండాల‌పై హైప‌ర్‌టెన్షన్ ప్రభావాల‌ను ఆయ‌న వివ‌రిస్తూ, “ప్రతి ఇద్దరు పెద్దలలో ఒకరికి అధిక రక్తపోటు ఉంటోంది. మూత్రపిండాల శాశ్వత వైఫల్యానికి అధిక రక్తపోటు రెండో ప్రధాన కారణం. బీపీ వ‌ల్ల మూత్రపిండాలలో రక్త నాళాలు సంకోచించి సంకుచితం అయిపోతాయి. దీనివ‌ల్ల రక్త ప్రవాహం త‌గ్గుతుంది, మూత్రపిండాల వడపోత పనితీరు దెబ్బతింటుంది. ఇది శాశ్వత నష్టానికి దారితీస్తుంది. అధిక రక్తపోటు వల్ల కలిగే మూత్రపిండాల వ్యాధిని తెలుసుకోవ‌డానికి రెండు సాధారణ పరీక్షలు చేయాలి.  మీ మూత్రపిండాలు మీ రక్తాన్ని ఎంత బాగా ఫిల్టర్ చేస్తాయో తెలుసుకోవడానికి రక్త పరీక్ష.  సీరం క్రియాటినిన్, లేదా ఈజీఎఫ్ఆర్ పరీక్ష. అల్బుమిన్ కోసం తనిఖీ చేయడానికి మూత్ర పరీక్ష. అల్బుమిన్ ఒక ప్రోటీన్, ఇది మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు మూత్రంలోకి వెళుతుంది” అని వివరించారు. “అధిక రక్తపోటు వ‌ల్ల మూత్రపిండాల వ్యాధి రాకుండా లేదా క‌నీసం కాస్త త‌గ్గేలా చేయాలంటే ర‌క్త‌పోటు త‌గ్గించ‌డానికి అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే మంచి మార్గం. ఈ దశలో రోజుకు 30 నుంచి 45 నిమిషాల నడక, ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవ‌డం, ధూమపానం మానేయడం, ఒత్తిడిని నివారించడం, తక్కువ ఉప్పు తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవ‌డం, క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం వంటివి చేయాలి. రక్తపోటును నియంత్రించడంలో తరచూ ఆరోగ్య పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయి” అని డాక్టర్ కె.క్రాంతికుమార్ సూచించారు.

About Author