రూ..11.16 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లకు మరమ్మతులు
1 min readరెండు,మూడు రోజుల్లో పనులు మొదలు కావాలి
డిసెంబరు నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి కావాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలో 412 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం రూ.11.16 కోట్లు మంజూరు చేసిందని, ఈ పనులు రెండు,మూడు రోజుల్లోపు మొదలు కావాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణంపై సంబంధిత శాఖ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబరు చివరి నాటికి మరమ్మతు పనులను పూర్తి చేసి గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు…రోడ్లపై గుంతలు ఉండడం వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన రోడ్లపై గుంతలు పూడ్చే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రధానంగా కోడుమూరు నుండి ఎమ్మిగనూరు వరకు ఉన్న రహదారిని టాప్ ప్రయారిటీ గా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు…15 రోజుల తర్వాత రోడ్ల నిర్మాణానికి సంబంధించి పనుల వారీగా పురోగతిపై సమీక్షిస్తామని, అప్పటికి కచ్చితంగా పురోగతి చూపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.వర్షాల వల్ల 260.57 కి.మీ పొడవునా దెబ్బ తిన్న రోడ్లకు మరమ్మత్తుల కోసం మరో రూ. 5.22 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని, నిధులు త్వరలో మంజూరు అవుతాయని, ఈ రోడ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రాల నుండి గ్రామాలకు వెళ్లే 14 రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ క్రింద ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, ఈఈ సురేష్ బాబు, డిఈలు పాల్గొన్నారు.