PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎఐ సమర్థ వినియోగంతో పరిపాలనలో దీర్ఘకాల సమస్యలకు చెక్!

1 min read

భారత్ లో డాటా విప్లవం ద్వారా ఎపికి $100 బిలియన్ల పెట్టుబడులు

రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశా… నా స్థానాన్ని ప్రజలే నిర్ణయిస్తారు

ఆర్థికంగా స్థిరపడ్డాకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలి

ఐటి సర్వ్ ఎలయెన్స్ సినర్జీ సమ్మిట్ లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  లాస్ వేగాస్ (యుఎస్ఎ): దైనందిన పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. లాస్ వేగాస్ లోని ఐటి సర్వ్ అలయెన్స్ సినర్జీ సదస్సుకు విశిష్ట అతిధిగా హాజరైన లోకేష్… ఫైర్ సైడ్ చాట్ లో పారిశ్రామికవేత్త  రవి తొట్టెంపూడి అడిగిన ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. 23దేశాల నుంచి 2300 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… 1992లో విడుదల చేసిన ఒక జిఓ కారణంగా ఇంటర్మీడియట్ లో దివ్వాంగులు కేవలం 5 సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్షలు రాసే విధానం వల్ల ఇటీవల రాష్ట్రానికి చెందిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.  నీట్ లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగులు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. వెంటనే అధికార యంత్రాంగాన్ని కదిలించి ఫ్రెష్ గా జిఓ విడుదల చేయడంతో వారికి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు లభించాయి. అధికారులు చొరవ చూపకపోతే వారి పరిస్థితి ఏమయ్యేది? గవర్నెన్స్ లో ఇటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఎఐని వినియోగించాలని భావిస్తున్నాం. గవర్నెన్స్, ఎడ్యుకేషన్, హెల్డ్ కేర్ తదితర రంగాల్లో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం.

అభివృద్ధిలో ఇతర దేశాలతో పోటీపడతాం

రానున్న రోజుల్లో భారత్ లో డాటా విప్లవం రాబోతోంది. డాటాసేవల రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రాబోతున్నాయి. అందులో వంద బిలియన్ డాలర్లను ఎపికి రప్పించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఇతరరాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీపడతాం.  సవాళ్లను అవకాశాలు తీసుకుని పనిచేయడం మాకు అలవాటైంది. ఇటీవల కృష్ణానదికి గత 248 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా వరదల వచ్చాయి. ఆ సమయంలో వ్యవసాయానికి వాడే డ్రోన్లను వరదబాధితులకు సాయం అందించేందుకు ఉపయోగించాం. తమ ప్రయత్నం విజయవంతం కావడంతో డ్రోన్ల ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందించడంపై దృష్టి సారించాం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ లో 5 గిన్నెస్ రికార్డులు రావడం ఆనందంగా ఉంది. ప్రజలకు మెరుగైన  సేవలందించేందుకు ప్రత్యేక డ్రోన్ పాలసీ తెచ్చాం. ఎఐ వినియోగంతో పాలనా పరమైన సమస్యలను అధిగమించడానికి త్వరలో రాష్ట్రంలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటుచేయబోతున్నాం. ఇది అంతర్జాతీయస్థాయి నిపుణలను తయారుచేస్తుంది. 

రాజకీయాల్లో ఎత్తుపల్లాలకు చూశాను

రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశాను. రాజకీయాల్లో భవిష్యత్తు కోసం ఎవరైనా సేఫ్ సీటు ఎంచుకుంటారు. నేను మాత్రం 1985 తర్వాత ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గాన్నినేను ఎంచుకున్నాను. 2014లో పోటీచేసి 5300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాను. అయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ సేవలందించా. ఫలితంగా ఇటీవల ఎన్నికల్లో నన్ను 91వేల పైచిలుకు మెజారిటీతో ప్రజలు గెలిపించారు. గెలుపుఓటములతో సంబంధం లేకుండా నిత్యం జనంలో ఉండే నేతలనే ప్రజలు ఆదరిస్తారు. జాతీయస్థాయి  రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా అన్న ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ… నా రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. శాఖల నిర్ణయించే సమయంలో లక్షలాదిమంది  భావిభారత పౌరుల భవిష్యత్తుతో ముడివడి ఉన్న విద్యాశాఖను ఎంపిక చేసుకున్నా. సవాల్ గా తీసుకుని విద్యావ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాను. ప్రస్తుత రాజకీయాలు సంక్లిష్టంగా మారాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే రాజకీయాల్లోకి రావాలని సలహా ఇస్తున్నా.  తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం లాంటిది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కీలకస్థానాల్లో ఉన్న నేతల మూలాలు టిడిపితోనే ముడివడి ఉన్నాయి.

అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తాం

అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తున్నాం. విశాఖపట్నాన్ని ఐటి హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం.  త్వరలో అక్కడ టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. పారిశ్రామీకరణ నేపథ్యంలో వ్యవసాయరంగం దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పాదకతకు మధ్య పొంతన లేకపోవడంతో గిట్టుబాటు సమస్య ఏర్పడుతోంది. రాయలసీమలో బంగారం పండే భూములున్నాయి. నేను పాదయాత్ర నిర్వహించే సమయంలో మామిడి, అరటి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు పండించే రైతులు నన్ను కలిసి పలు సమస్యలను తెలియజేశారు. అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న రకాలను సాగుచేయాల్సిందిగా నేను వారికి సూచించాను. ఒక్కొకసారి కిలో 10పైసలకు కూడా టమోటా రైతులు తమ పంటను తెగనమ్ముకోవడం చూసి బాధ కలిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం, మార్కెట్ ఇంటర్వెన్షన్ తో రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు మేం కృషిచేస్తున్నాం. 2017లో ఐటి సర్వ్ సదస్సుకు వచ్చాను. మళ్లీ ఇదే సదస్సుకు హాజరై మిత్రులను కలవడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *