PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండు నెల‌ల బాబుకు ఎక్మోతో ప్రాణాలు కాపాడిన వైజాగ్ కిమ్స్ కడల్స్ వైద్యులు

1 min read

ఆపై సంక్లిష్టమైన గుండె శ‌స్త్రచికిత్స‌

ల‌క్ష మందిలో ఆరుగురికే వ‌చ్చే టీఏపీవీసి

విజ‌య‌వంతంగా న‌యం చేసిన క‌డ‌ల్స్ వైద్యబృందం

పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం: రెండు నెల‌ల వ‌య‌సు, కేవ‌లం 2.7 కిలోల బ‌రువు ఉన్న ఓ బాబుకు అత్యంత అరుదైన‌ గుండె వ్యాధి వ‌చ్చింది. ఆ బాబును విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు బాబుకు వెంట‌నే ఎక్మో పెట్టి, మూడు రోజుల త‌ర్వాత ఒక సంక్లిష్టమైన గుండె శ‌స్త్రచికిత్స చేసి స‌మ‌స్యను న‌యం చేశారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్పత్రికి చెందిన చీఫ్ నియోనాటాల‌జిస్ట్, నియోనాటాల‌జీ విభాగాధిప‌తి డాక్టర్ నిఖిల్ తెన్నేటి, చీఫ్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిప‌తి డాక్టర్ రౌతు సంతోష్ కుమార్ విలేఖ‌రుల‌కు తెలిపారు. “సాధార‌ణంగా ఊపిరితిత్తుల్లో శుద్ధిచేసిన ర‌క్తం అక్కడినుంచి ర‌క్త‌నాళాల ద్వారా గుండెలోని ఎడ‌మ క‌ర్ణిక‌కు వెళ్లి, అక్కడి నుంచి శ‌రీరం మొత్తానికి స‌ర‌ఫ‌రా అవ్వాలి. కానీ, ఈ బాబుకు మాత్రం ర‌క్తం కుడివైపు గుండె గ‌దిలోకి వెళ్లిపోతోంది. అక్కడ శుద్ధి చేయ‌ని ర‌క్తంతో క‌లిసిపోతోంది. దానివ‌ల్ల శ‌రీరానికి త‌గినంత ర‌క్తస‌ర‌ఫ‌రా ఉండ‌ట్లేదు. ఈ స‌మ‌స్య‌ను వైద్య ప‌రిభాష‌లో టోట‌ల్ అనామ‌ల‌స్ ప‌ల్మ‌న‌రీ వీన‌స్ కనెక్షన్ (టీఏపీవీసి) అంటారు. ప్రతి ల‌క్ష మంది పిల్ల‌ల్లో కేవ‌లం 6 నుంచి 12 మందికి మాత్ర‌మే ఈ స‌మ‌స్య పుట్టుక‌తోనే ఉంటుంది. పుట్ట‌డానికి ముందు 2-10% కేసుల్లోనే దీన్ని గుర్తిస్తారు. దానికితోడు ఈ బాబుకు ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్‌ కూడా బాగా ప‌డిపోయింది. ఆస్ప‌త్రికి తీసుకొచ్చేస‌రికి కేవ‌లం 43% ఉంది. దాంతో ముందుగా ఆక్సిజ‌న్ స్థాయి పెంచ‌డానికి ఎక్మో పెట్టాల‌ని నిర్ణ‌యించాం. ప్రాణాలు కాపాడేందుకు సెంట్ర‌ల్ వీఏ ఎక్మో పెట్టాం. ఇంత చిన్న పిల్ల‌లు, ముఖ్యంగా బ‌రువు త‌క్కువ‌గా ఉన్న పిల్ల‌ల‌కు ఎక్మో పెట్ట‌డం చాలా స‌వాలుతో కూడుకున్నది. అయినా పెట్టి, అలా మూడు రోజుల పాటు ఉంచిన త‌ర్వాత బాబు కొంచెం కోలుకున్నాడు. అప్పుడు గుండెలో ఉన్న స‌మ‌స్యను స‌రిచేసేందుకు ఓపెన్ హార్ట్ స‌ర్జరీ చేయాల్సి వ‌చ్చింది. ఇంత చిన్న వ‌య‌సులో, అది కూడా బ‌రువు త‌క్కువ‌గా ఉన్న శిశువుల‌కు శ‌స్త్రచికిత్స త‌ర్వాత సంర‌క్షణ కూడా చాలా ముఖ్యం. ఇన్ని స‌మ‌స్య‌లున్నా..  బాబు చ‌క్కగా కోలుకున్నాడు” అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇలాంటి అసాధార‌ణ వైద్య చికిత్స అందించ‌డం చాలా అరుదు. రెండు నెల‌ల వ‌య‌సు, 2.7 కిలోల బ‌రువు మాత్ర‌మే ఉన్న శిశువుకు తొలుత ఎక్మో పెట్టడం, త‌ర్వాత ఓపెన్ హార్ట్ శ‌స్త్రచికిత్స చేయ‌డం లాంటివి కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రి వైద్యబృందం అసాధార‌ణ నైపుణ్యాలు, నిబ‌ద్ధత‌కు నిద‌ర్శనం. డాక్టర్ నిఖిల్ తెన్నేటి, డాక్టర్ ఆర్‌. సంతోష్‌కుమార్‌, డాక్టర్ ర‌వికృష్ణల నేతృత్వంలోని ఈ బృందం చిన్నపిల్లల వైద్యంతో పాటు క్రిటిక‌ల్ కేర్ లాంటి విభాగాల్లో అత్యున్నత సేవ‌లందించి ఈ బాబు ప్రాణాలు కాపాడింది. డాక్టర్ అనిల్ కుమార్‌, డాక్టర్ సాయి మ‌ణికంద‌న్‌, డాక్టర్ శాంతిప్రియ‌ల‌తో కూడిన గుండె శ‌స్త్రచికిత్స నిపుణుల బృందం కేవ‌లం శ‌స్త్రచికిత్స చేయ‌డ‌మే కాక‌, చికిత్స కొన‌సాగినంత కాలం బాబును కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అన్నీ బాగుండ‌డంతో 25 రోజుల త‌ర్వాత బాబును డిశ్చార్జి చేశారు. “ఇది మా సామ‌ర్థ్యాల‌కు నిజ‌మైన ప‌రీక్ష‌, బాబు చాలా విష‌మ ప‌రిస్థితుల్లో మా వ‌ద్దకు వ‌చ్చాడు. మేం కాలంతో ప‌రుగులు పెట్టాల్సి వ‌చ్చింది. ఎక్మో మీదే ఆశల‌న్నీ పెట్టుకున్నాం. అది స‌త్ఫలితాల‌ను ఇవ్వడంతో బాబును కాపాడ‌గ‌లిగాం” అని డాక్టర్ నిఖిల్ తెన్నేటి వ్యాఖ్యానించారు. “ఇంత చిన్న పిల్లల‌కు ఎక్మో పెట్టడం చాలా స‌వాళ్లతో కూడుకున్నది. అన్ని విభాగాల వైద్యులు ప‌ర్యవేక్షిస్తూ ఉండాలి, 24 గంట‌లూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ‌లితాలు చూసి మేమంతా ఎంతో సంతోషించాం. ఇలా ఓ బాబు ప్రాణాలు కాపాడ‌డంలో మేమంతా భాగ‌స్వాములు అయినందుకు సంతోషంగా ఉన్నాం” అని డాక్టర్ ఆర్. సంతోష్‌కుమార్ చెప్పారు.

About Author