కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
1 min readకమలాపురం వైసిపి నాయకుడు సాయినాథ్ శర్మ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కరువుకు శాశ్వత నిలయమైన కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైయస్సార్సీపి రాష్ట్ర నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ డిమాండ్ చేశారు. కమలాపురంలో ఆదివారం సాయంత్రం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. అతివృష్టి అనావృష్టి కారణంగా కమలాపురం నియోజకవర్గంలోని రైతాంగం పంటలు చేతికి రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కమలాపురం నియోజక వర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండల జాబితాలో కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాలు లేకపోవడం రైతులకు తీరని అన్యాయన్నారు కమలాపురం నియోజకవర్గంలో డెబ్భై శాతం పైగా రైతులు వర్షాధారం పంటలు సాగు చేస్తుంటారన్నారు. అధిక శాతం మెట్ట భూమి ఉండడంతో రైతులు వర్షాల మీద ఆధారపడి జీవిస్తున్నారన్నారు. గత ఏడాది వర్షాలు లేక పంటలు చేతికి రాక రైతులు అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అధికారులు కమలాపురం ప్రాంతం రైతుల సమస్యలను గుర్తించకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా చెప్పుకునేటువంటి ప్రభుత్వం కమలాపురం నియోజకవర్గ రైతాంగానికి ఇంతటి అన్యాయం చేయడం రైతులకు ద్రోహం చేసినట్లేనన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. వీరపునాయన పల్లె మండలం పెండ్లిమర్రి మండలాలలో ఉల్లిగడ్డలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. ఇటీవల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఉల్లి రైతుల సమస్యల గురించి నియోజకవర్గంలో రైతులతో చర్చించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారన్నారు. సరైన సమయంలో వర్షాలు కురవక, పంటలు చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో మరికొన్నిచోట్ల రైతులు నష్టపోతూనే ఉన్నారన్నారు. కమలాపురం కరువును శాశ్వతంగా పరిష్కరించడానికి నియోజకవర్గంలో వ్యవసాయం పంటల సాగులో అనుభవం ఉన్న రైతులతో కమిటీ వేసి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేయాలనిఆయన డిమాండ్ చేశారు. అలాగే ఉల్లి రైతుకు తక్షణమే నష్టపరిహారం భారీగా చెల్లించాలని ఆయన కోరారు. రైతులు పడుతున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తాము వినతిపత్రం పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఈక్రాప్ విధానం ద్వారా రైతులకు భారీగా నష్టం జరుగుతోందన్నారు.ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కమలాపురం నియోజకవర్గ రైతాంగ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలనిఅయన కోరారు.