ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించాలి
1 min readపాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి
కల్లూరు అర్బన్ వార్డుల అభివృద్ధిపై సమీక్ష
పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : వార్డులలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎస్బిఐ కాలనీలోని నగరపాలక కౌన్సిల్ సమావేశంలో కల్లూరు అర్బన్ పరిధిలోని 16 వార్డుల అభివృద్ధిపై కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు నేతృత్వంలో నగరపాలక అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో కల్లూరు ప్రాంతంలో కొత్త కాలనీలు అధిక సంఖ్యలో ఉన్నాయని, అందులో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వాటన్నింటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైన రహదారులు, మురుగు కాల్వల పనులను జాప్యం లేకుండా నిర్మించాలని, అలాగే పార్కుల అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. అభివృద్ధికి నోచుకోని పార్కులపై దృష్టి సారించాలని, వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని, స్థంభాల మార్పు, విద్యుత్ దీపాల మరమ్మతులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు తాగునీటిని పగటిపూట సరఫరా చేయాలని, సరఫరా సమయాన్ని పెంచాలని కోరారు. పారిశుద్ధ్య సిబ్బందిని పెంపునకు చర్యలు చేపట్టాలని, వాటికి అవసరమైన సహకారం ప్రభుత్వ స్థాయిలో అందిస్తామన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పందిపాడు, లక్ష్మీపురం ప్రాంతల్లో తాగునీళ్ళు కలుషితం కాకుండా చూడాలన్నారు. కుక్కల బెడద సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక నాయకులు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను, అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, కొన్ని సమస్యల పరిష్కారంలో అనుమతులు, ఇతరత్రా కారణాలతో ఆలస్యం జరుగుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రజా సమస్యలన్నీ పరిష్కారిస్తామన్నారు. టిడ్కో వాసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.అనంతరం పలు వార్డులకు చెందిన నాయకులు ఆయా వార్డుల స్థానిక సమస్యలను తెలిపగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సంబంధింత అధికారులు సమాధానం ఇచ్చారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, ఎస్ఈ రాజశేఖర్, ఆరోగ్యధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.