అవినీతి అధికారికి వత్తాసు పలకడమా…
1 min readవిద్యార్థుల సొమ్మును మెక్కిన అధికారికి రీ పోస్టింగ్ ఇవ్వడం దారుణం….
జిల్లా కలెక్టర్ స్పందించాలి..విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి….
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో విద్యార్థుల కడుపులు మాడ్చి విద్యార్థుల సొమ్మును అక్రమంగా మెక్కారన్న ఆధారాలతో ఎమ్మిగనూరు కేజీబీవీ ఎస్.ఓ ని విధుల నుండి పూర్తిగా తొలగించారని అయితే మళ్ళీ అక్కడే పోస్టింగ్ ఇవ్వడం వెనుక అంతర్యం ఏమిటో జిల్లా కలెక్టర్ స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు శేఖర్, మహేంద్ర బాబు, నరసన్న, వీరేష్ యాదవ్,సురేంద్ర బాబు, క్రిష్ణ, ఆఫ్రిద్, అజిత్ డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక పట్టణంలో విలేకురుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతి కొరకు కేజీబీవీ లను ఏర్పాటు చేశారని,అయితే ఇక్కడ ఎస్. ఓ గా విధులు నిర్వహిస్తున్న కవిత విద్యార్థులకు సహాయం చేయాల్సింది పోయి విద్యార్థుల ఆకలి కొరకు కేటాయించి సొమ్మును మెక్కడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.ఆమె అవినీతి చేసిందని విచారణలో తేలిందని,స్వయానా జిల్లా కలెక్టర్ గారే ఆమెను విధుల నుండి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారని,అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జిల్లా కలెక్టర్ విచారణ ఏమైందో కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇంత అవినీతి చేసి,విద్యార్థుల రక్తాన్ని తాగిన ఎస్. ఓ కి జిల్లా ఉన్నతాధికారులు వత్తాసు పలకడం వెనుక పెద్ద కుట్ర ఉందని జిల్లా కలెక్టర్ బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.అదేవిదంగా అవినీతి అక్రమాల ఎస్ఓ ఉద్యోగం నుండి తొలగించే వరకు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు హజిత్,ఆఫ్రిద్, వెంకటేష్, నాగరాజు, నరసింహ రెడ్డి, దావీదు తదితరులు పాల్గొన్నారు.