ఎమ్మెల్యేలకు మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు..!
1 min readవైయస్సార్సీపీరాష్ట్ర నేత సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం ఇక రాష్ట్రాన్ని మంచిగా ఎలా పరిపాలిస్తుందని వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ప్రభుత్వ తీరును విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం నాడు అసెంబ్లీకి హాజరైన అధికార పార్టీ కూటమి శాసనసభ్యులు తమకు భోజనం సరిగా పెట్టలేదంటూ తాము తినే భోజనం ఏమాత్రం రుచిగా లేదంటూ సరైన భోజనం లేక తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు ఫిర్యాదు చేయడంసుదీర్ఘ పరిపాలన అనుభవం అని చెప్పుకునే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేల భోజనం విషయంలో చివరకు స్పీకర్ ద్వారా మంచి భోజనం కోసం సిఫార్సు చేపించుకునే పరిస్థితికి ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలకుల తీరు దిగజారడం శోచనీయమన్నారు. అసెంబ్లీలో సమావేశాల నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ మంచి భోజనం శాసనసభ్యులకే పెట్టకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కక్షపూరిత వాతావరణం సృష్టించడానికి శ్రద్ధ పెడుతున్న పాలకులు ఎమ్మెల్యేలకు మంచి భోజనం పెట్టడంలో శ్రద్ధ తీసుకోక పోవడం శాసనసభ్యులను అవమానపరిచినట్లే అని అన్నారు. వైసిపి గత ఐదు సంవత్సరాల కాలంలో శాసనసభ్యుల్లో ఒకరు కూడా అసెంబ్లీలో భోజనం బాగోలేదని ఫిర్యాదు చేయలేదన్నారు. ఎమ్మెల్యేలకు అన్ని వసతులు సమకూర్చిన ఘనత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. శాసనసభ్యులుకే మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం ఇక సూపర్ సిక్స్ పథకాలు ఏమి అమలు చేస్తుందని అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోందన్నారు. సోషల్ మీడియా వ్యతిరేక పోస్టులపై చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన అధికారపక్షం రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం పట్ల శ్రద్ధ కనపరచకపోవడం విచారకరమన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూటమి పాలకులు కృషి చేయాలని ఆయన సూచించారు.