PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షుగర్​… వ్యాపిస్తోంది..!

1 min read

జిల్లాలో పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు

  • వ్యాయామం లేదు.. పని చేయరు.. ఫుడ్​ కంట్రోల్​ అసలే లేదు…
  • పనిలో ఒత్తిడికి గురైతే.. కూడా చక్కెర వ్యాధి చేరువయ్యే అవకాశం..!
  • మద్యం, ధూమపానానికి దూరంగా ఉంటే మేలు….
  • జీవనశైలిలో మార్పుతో… షుగర్​ కంట్రోల్​…!
  • నవంబరు 14న అంతర్జాతీయ మధుమేహ వ్యాధి దినోత్సవం  

 కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం పెరిగేకొద్దీ…. మనిషి శారీరక శ్రమకు దూరమవుతూ ఉన్నాడు. దీనికితోడు మానసిక ఒత్తిడికి గురవుతూ… రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. వ్యాయామం చేయకపోవడం… రోజువారీ పనులు చేసుకోకపోవ డం… భోజనం అపరిమితంగా భుజించడం వల్ల మధుమేహ ( చక్కెర) వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం సమాజంలో మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. స్వీయనియంత్రణ లేకపోవడం… చెడు అలవాట్లకు బానిస కావడం తదితర కారణాలతో చక్కెర వ్యాధి వ్యాపిస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నవంబరు 14న అంతర్జాతీయ మధుమేహ ( చక్కెర) వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

చక్కెర..వ్యాపిస్తోంది…

1991లో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి ఇన్సులిన్​ కనుగొన్న సర్​ ఫ్రెడరిక్​ బాంటింగ్​ జన్మదినోత్సవమైన నవంబరు 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా 160కి పైగా దేశాలలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు.  2024 సంవత్సరం థీమ్.. ‘‘ అడ్డంకులను చేధించడం… అంతరాలను తగ్గించడం ” . ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై మధుమేహం ప్రభావాన్ని హైలెట్ చేస్తోంది.  

ఇన్సులిన్ లోపం….:

ప్రపంచవ్యాప్తంగా 537 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు.  ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యాధిగ్రస్తులు మధ్యస్థ ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారిలో సుమారు 50% మందికి వారి పరిస్థితి తెలియదు. మధుమేహం అనేది శరీరంలో ఇన్సులిన్ విడుదలలో లోపం, లేదా ఇన్సులిన్ పనితీరులో లోపం వల్ల హైపర్ గ్లైసీమియాను కలిగించే ఒక జీవక్రియ వ్యాధి.

మానసిక ఒత్తిడికి గురైతే…:

మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలా మంది వ్యాయామం చేయడం లేదు. పనులు కూడా చేయడంలేదు. దీనికితోడు ఫుడ్​ కంట్రోల్​ అసలే లేరు. జంక్​, ఫాస్ట్​ ఫుడ్ అధికంగా తినడం…మద్యం, ధూమపానానికి బానిస కావడం తదితర కారణాలతో చక్కెర వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  కొందరు ఉద్యోగులో తమ పనిలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాంటి వారు మధుమేహ వ్యాధికి చేరవవుతారు. కేవలం తల్లిదండ్రులకు ఉంటేనే మధు మేహం రాదు… స్వీయ నియంత్రణ లేపోవడమూ ఇందుకు కారణమవుతుంది.

స్వీయ నియంత్రణ ఉండాలి

​​​​​ ​​​​​​​​ ​​ ​​శ్రీనివాసులు, మధుమేహ వైద్య నిపుణులు, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి  హెచ్​ఓడి.

మధుమేహం సంరక్షణలో 90% పైగా స్వీయ సంరక్షణ అవసరం. ప్రతి రోజు ఉదయం గంటపాటు నడవాలి. లేదా రన్నింగ్​  చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. శారీరకంగా శ్రమ పడాలి.  పనిలో ఒత్తిడికి గురి కాకూడదు. జంక్​,ఫాస్ట్​ ఫుడ్​ తినకూడదు. జొన్న రొట్టే, బ్రౌన్​ రైస్​, కొర్రన్నం, మిల్లెట్స్​ తదితర ఆహారం తీసుకుంటే మంచిది. అధిక బరువు ఉండకూడదు.  ట్రైప్​ –1 వ్యాధిగ్రస్తులు టాబ్లెట్లు, టైప్​ –2  వారు ఇన్సులిన్​ సక్రమంగా వాడాలి.

‘ చక్కెర ’ పై ..అవగాహన అవసరం

— డాక్టర్ సి. గోపినాథ్ రెడ్డి ,  కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ , కిమ్స్ ఆసుపత్రి, కర్నూలు

మధుమేహం వ్యాధి … కేవలం వారసత్వం వల్లే వస్తుందనుకోవడం పొరపాటు. శరీరంలో ఇన్సులిన్​  విడుదల లోపం,  ఇన్సులిన్ పని తీరు సరిగా లేకపోయినా చక్కెర వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.  పని చేయకపోవడం… కొందరు పనిలో అధికంగా మానసిక ఒత్తిడికి గురి కావడం… మద్యం, పొగ తాగడం వంటి  తదితర కారణాలతో మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు వ్యాధిపై అవగాహన ఉంటే చాలా మేలు.

లక్షణాలు..గుర్తించాలి

— డా.మురళి, ఎం.డి. జనరల్​ మెడిసిన్​, అమీలియో హాస్పిటల్​, కర్నూలు

మధుమేహం వ్యాధిని ముందే గుర్తించాలి. డయాబెటిస్​ ఉన్న వారికి అధికంగా దాహం  వేస్తోంది. సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. మసక దృష్టి… అలిసినట్లు అనిపించడం.. ఆకలి ఎక్కువగా వేయడం.. అనుకోకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి.  పెద్దలలో  అవసరమైనంత ఇన్సులిన్​ ఉత్పత్తి కాకపోవడం… ఇన్సులిన్​ పని తీరు సరిగా లేకపోవడం తదితర కారణాలతో షుగర్​ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. షుగర్​ వ్యాధిగ్రస్తులు దగ్గరలో ఉండే షుగర్​ వైద్య నిపుణుల సలహా, సూచనలు పాటించాలి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *