జ్ఞాన భారతానికి ఊపిరి గ్రంథాలయాలు..
1 min readనగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతదేశంలో దశాబ్దాల నుండి ప్రజలకు జ్ఞానోదయం కలిగించడంలో గ్రంథాలయాలు ఎంతో కీలకపొత్ర పోషిస్తున్నానని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక, పురాతన నాణెములు ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కమిషనర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి సమాచారాన్ని అందించాలన్నదే పౌర గ్రంథాలయాల ప్రాథమిక సూత్రమని తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తకాలు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయన్నారు. ఈ జ్ఞానం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పుస్తకాలు అందుబాటులో లేనివారు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎందరో మహానుభావులు గ్రంథాలయాల్లోని పుస్తకాలను అధ్యయనం చేసి, ఉన్నత స్థానానికి చేరుకున్నారని, మహోన్నత పదవులను సంపాదించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు సముపార్జించాలని కోరారు.అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అలాగే లైబ్రరీ సిబ్బంది కమిషనర్‌ను సత్కరించారు.కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.షాషావలి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే.ప్రకాష్, రాష్ట్ర గ్రంథాలయ సంఘం అధ్యక్షులు కే.చంద్రశేఖర కల్కూర, విశ్రాంత ఇంజినీర్లు ముచ్చుకోట చంద్రశేఖర్, నిఖిలేష్, ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు మద్దిలేటి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.