మూర్ఛ కు.. భయపడొద్దు…!
1 min readఫిట్స్ కు.. వయస్సు సంబంధం లేదు…
- పుట్టిన బిడ్డకు మెదడు ఎదుగుదల సరిగా లేకపోయినా… జ్వరం వచ్చినా…
- నిద్ర లేమి…మానసిక ఒత్తిడికి గురైనా.. ‘వాయి’ వచ్చే అవకాశం…
- అతిగా మద్యం సేవించినా..పొగ తాగినా…. ఇక అంతే..
- సరైన మోతాదులో మందులు వాడితే… కంట్రోల్..
- నవంబరు 17న జాతీయ ఎపిలెప్సీ డే
ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్న వ్యక్తి… ఉన్నట్టుండి కింద పడి స్పృహ కోల్పోయి కాళ్లు.. చేతులు కొట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము. దానినే ఫిట్స్ అంటారు. చిన్న పెద్ద.. అనే వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే మూర్ఛ వ్యాధి ఎన్నో రకాలుగా ఉంటుందని, అటువంటి ‘వాయి’ ని … సరైన మోతాదులో మందులు వాడితో తగ్గించవచ్చని స్పష్టం చేశారు వైద్య నిపుణులు. వ్యాధి రకాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలని వెల్లడిస్తున్న న్యూరాలజిస్టులు … మూర్ఛ వ్యాధి కి ఎవరూ భయపడవద్దని పేర్కొంటున్నారు.
కర్నూలు, పల్లెవెలుగు:మనిషికి ఒకసారి వస్తే మూర్ఛ వ్యాధి అంటారు… రెండు లేదా అంత కన్నా ఎక్కువగా వస్తే దానిని ఎపిలెప్సీ అంటారు. మన భాషలో ‘ వాయి ’ అని అంటాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల మంది మూర్చ వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో 1.2 కోట్ల ఇండియన్స్ మూర్చ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి పై అవగాహన కల్పించేందుకు ఎపీలెప్సీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నవంబరు 17న నేషనల్ ఎపిలెప్సీ దినోత్సవం నిర్వహిస్తారు.
నోటి నుంచి నురుగు… నాలుక కొరుక్కోవడం…
ముందస్తు హెచ్చరికల లేకుండా అకస్మాత్తుగా వస్తుంది. స్పృహ కోల్పోవడం, కాళ్లు మరియు చేతుల్లో నియంత్రణ కోల్పోయి కొట్టుకోవడం చూస్తూ ఉంటాము. నోటి నుండి నురుగు రావడం, నియంత్రణ లేకుండా మల మరియు మూత్ర విసర్జన దుస్తులలోనే అవ్వడం, నాలుక కొరుక్కోవడం వంటివి చూస్తాము. కొన్ని రకాల సాధారణ మూర్చలలో శరీరంలో కొన్నిసార్లు జర్క్‌లు రాపడం (మయోక్లోనిక్ ఫిట్స్) గమనిస్తాం. కొన్ని సార్లు 10 నుండి 20 సెకన్ల వరకు స్పందించకుండా ఉండటం గమనిస్తాము (ఆబ్సెన్స్ ఫిట్స్)
మెదడులో విద్యుత్ యాక్టివిటికి ఇబ్బంది కలిగితే…
మెదడులోని ఒక చిన్న ప్రాంతానికి పరిమితం చేయబడిన అసాధారణ విద్యుత్ తో ఇవి ప్రారంభం అవుతాయి. ఈ రకం మూర్చలు వచ్చే ముందు కొన్ని లక్షణాలను పేషెంట్ గమనించగలరు. ఫిట్స్ వచ్చే ముందు ఒక రకమైన భయం రావడం, కొంతమందిలో కొన్ని రకాల అసాధారణ వాసనలు తెలియడం, కళ్ల ముందు రంగులైట్ల దృశ్యాలు కనిపించడం వంటి వాటిలో మొదలు అపుతాయి. ఫిట్స్ మొదలు అయ్యాక స్పందించకుండా అవ్వటము, పెదవులు నమలడం, చప్పరించడం వంటివి చూస్తూ ఉంటాము. ఈ రకం మూర్చలలో శరీరంలో ఒక భాగంలో మొదలై రెండవ భాగానికి మొత్తం విస్తురిస్తుంది.
‘ ఫిట్స్ ’కు.. కారణాలెన్నో…
పుట్టిన పిల్లలు డెలివరీ సమయంలో బ్రెయిన్ బ్లడ్ సర్క్యూలేషన్ లేకపోవడం వల్ల ఫిట్స్ రావచ్చు. రక్తంలో గ్లూకోజ్ లెవల్ తగ్గడం కూడా ఫిట్స్ రావచ్చు పుట్టినప్పుడే మెదడు ఎదుగుదల సరిగా లేకపోయినా…మెదడులో ఇన్ఫెక్షన్ వచ్చినా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఫిట్స్ కు దారి తీస్తాయి. అతిగా ఆల్కాహాల్ తీసుకోవడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం మరియు ఒక్కసారిగా మద్యం మానేయడం వంటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. రోడ్ ప్రమాదాలలో తలకు గాయం అవ్వడం వల్ల ఫిట్స్ రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఫిట్స్ కు కారణంగా ఉంటాయి.
మందులు వాడితో… అదుపులో…
- డా. సి. శ్రీనివాసులు , ప్రొఫెసర్ అండ్ న్యూరాలజి హెచ్ఓడి, జీజీహెచ్
సాధారణంగా 70-80 శాతం మందిలో ఒకటి లేక రెండు మందులు సరైన మోతాదులో వాడినట్లు అయితే ఫిట్స్ పూర్తిగా అదుపులో ఉంటాయి. 20 శాతం మందిలో మందులు వాడినా కూడా ఫిట్స్ వస్తుంటాయి. ఇలాంటి వారిలో 3టి ఎంఆర్, వీడియో ఈఈజీ, పెట్ స్కాస్ వంటివి నిర్వహించి మెదడులో ఏ భాగం నుండి విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో తెలుసుకోవాలి. ఆ భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించినట్లయితే చాలా వరకు ఫిట్స్ తగ్గే అవకాశం ఉంది. అయితే ఆపరేషన్ చేశాక కూడా కొంతకాలం మందులు వాడాల్సి ఉంటుంది.
జన్యుపరమైతే…జీవితాంతం మందులు వాడాల్సిందే..
- డా. చల్లెపల్లి బాబురావు , కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ , కిమ్స్ హాస్పిటల్, కర్నూలు
కొంతమంది పిల్లల్లో జన్యుపరమైన కారణాల వలన ఫిట్స్ వస్తూ ఉంటాయి, వీరిలో కొంతమందికి జీవితాంతం కూడా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. మందులు వాడినా కూడా కొంతమందిలో ఫిట్స్ వస్తుంటాయి. ఆపరేషన్ వలన కూడా ఫిట్స్ తగ్గే అవకాశం ఉండదు. వీరిలో కొంతమందికి కిటోజెనిక్ డైట్, వెగల్స్ నర్వ్ స్టిమ్యులేషన్ వంటి పద్ధతుల ద్వారా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంది.
డ్రైవింగ్.. స్విమ్మింగ్ వద్దు…
- డా.హరి ప్రసాద్ కంచర్ల, సైకియాట్రిక్, మౌర్య హాస్పిటల్, కర్నూలు
మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తి క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఒకటి, రెండ్రోజులు మందులు వాడకుండా ఆపినా ఫిట్స్ రావచ్చు. రోజుకు 6-8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మత్తు మందులు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పదే పదే ఫిట్స్ వచ్చే వారు డ్రైవింగ్, స్విమ్మింగ్ తప్పనిసరిగా ఆపడం మంచిది. మూర్ఛ వ్యాధి ఉన్న వారు, వారి పర్సులో వారి జబ్బును గూర్చి తెలియజేసే కార్డును పెట్టుకుంటే మంచిది.
మంత్రగాళ్లను నమ్మొద్దు..
- డా.రమేష్ బాబు, సీనియర్ సైకియాట్రిక్, మానస క్లినిక్ , కర్నూలు
ప్రతిఒక్కరూ మూర్ఛ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. ఆధునిక వైద్య సదుపాయాలున్నప్పటికీ గ్రామీణ ప్రాంతం వారు నిర్లక్ష్యం.. నిరక్షరాస్యత కారణంగా మంత్రగాళ్లు లేదా భూత వైద్యులను సంప్రదిస్తున్నారరు. దీని వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువై.. ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణమైంది. మూర్చవ్యాధులు అనేక రకాలుగా ఉంటుంది. ఏ వ్యక్తిలో నైన అపస్మారక లక్షణాలు కనిపిస్తే.. వెంటనే న్యూరాలజిస్టులను సంప్రదించండి.