‘ శ్వాస’ తగ్గిస్తోంది..!
1 min readసిగరేట్, బీడి,గంజాయితో పెరుగుతున్న లంగ్స్ సమస్యలు..
- రసాయన..పొగ బారిన పడిన వారు శ్వాస తీసుకోవడం కష్టమే…
- దగ్గు, ఆయాసం, ఆస్తమా కు దారి తీసే ప్రమాదం…
- సమస్య తీవ్రమైతే… క్యాన్సర్, ఊపిరితిత్తుల్లో గడ్డలు వచ్చే అవకాశం..
- మందులు వాడితే… కంట్రోల్…
- నవంబర్ 20న వరల్డ్ సిఓపిడి డే
అభిమాన నటుడు పొగ పీల్చాడనో…. ఫ్రెండ్స్ ఒత్తిడి చేశారనో…. సరదా కోసమో… సిగరేట్, బీడి, గంజాయికి అలవాటు పడిన యువత…. శ్వాసకోశనాళాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రసాయన, వాయు కాలుష్యం తదితర వాటితో మనిషి అనారోగ్యపాలవుతూ…ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తే.. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు పల్మనాలజిస్టులు. నవంబరు 20న వరల్డ్ సిఓపిడి ( క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) డే సందర్భంగా ప్రత్యేక కథనం.
కర్నూలు, పల్లెవెలుగు:ఊపిరి తీసుకోవడం…వదలడం… వంటివి రెండూ శ్వాసకోశనాళాల మీదనే ఆధారపడి ఉంటుంది. అటువంటి శ్వాసకోశనాళాలు పెను ఒత్తిడికి గురై దెబ్బతింటున్నాయి. ఆధునిక ప్రపంచంలో యువతతో మొదలుకొని ముదుసలి వరకు సిగరేట్, బీడి, గంజాయికి అలవాటు పడి…. దాన్ని విడవలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చివరకు వెంటీలెటర్ వరకు వెళ్లి…బయట పడుతున్నారు.
శ్వాసనాళాలు దెబ్బతినేదిలా..
సమాజంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. కొన్నేళ్ల క్రితం కట్టెల పొయ్యిలో పొగచూరి… ముక్కు,నోటి ద్వారా వెళ్లి ఊపిరితిత్తులు, శ్వాసకోశ నాళాలు దెబ్బతినేవి. ప్రస్తుతం కట్టెల పొయ్యి సంఖ్య తగ్గినా… సిగరేట్, బీడి, గంజాయికి అలవాటు పడిన వారు అనారోగ్యపాలవుతున్నారు. వాయుకాలుష్యం, మంటలు, పొగతో సావసం చేసే వారి శ్వాసకోశనాళాలు ఉబ్బి పోతాయి. సమస్య తీవ్రమైతే ఊపిరితిత్తులు కూడా సాగుతాయి.
ఊపిరితిత్తుల సామర్థ్యం….
వాయు కాలుష్యం.. మంటలు ఉన్న చోట నివసించే వారు… సిగరేట్, బీడీ, గంజాయి పీల్చే వారి ఊపిరితిత్తులు సాగి ఉంటాయి. అంతేకాక బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంది. హార్మోన్స్ కూడా దెబ్బతింటాయి. రక్తనాళాల్లో ఆక్సిజన్ శాతం తక్కువై… కార్బన్డయాక్సైడ్ ఎక్కువవుతుంది. అప్పుడు ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువ కావడంతో ..వెంటి లెటర్ పై చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
సీఓపీడి…అంటే…
ప్రతి సంవత్సరం నవంబర్ 3వ బుధవారం ప్రపంచ సిఓపిడి దినోత్సవంగా పాటిస్తారు. ఈ సంవత్సరం ప్రపంచ సిఓపిడి దినోత్సవం యొక్క 2024 థీమ్ “మీ ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోండి.” ప్రపంచ సిఓపిడి దినోత్సవం నవంబర్ 20న జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ ఊపిరితిత్తుల పనితీరును కొలిచే ప్రాముఖ్యతను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని స్పిరోమెట్రీ అని కూడా పిలుస్తారు. స్పిరోమెట్రీ అనేది నిర్ధారణకు ఒక సమగ్ర సాధనం. అయినప్పటికీ సిఓపిడి ఇది జీవితాంతం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కొలవడానికి కూడా ఉపయోగపడుతుంది.
మందులు వాడితే..కంట్రోల్..
— ఎ.ఎస్. శ్రీకాంత్, ప్రొఫెసర్ అండ్ హెచ్ ఓడి, పల్మనాలజిస్ట్, జీజీహెచ్.
వాహనాల నుంచి వచ్చే పొగ, సిగరేట్, బీడి, గంజాయి అధికంగా పీల్చే వారికి, బొగ్గు గనులలో పని చేసేవారికి శ్వాసకోశ నాళాల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. దగ్గు, గళ్ల, ఆయాసం, ఆస్తమా వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పల్మనాలజిస్టులను సంప్రదించాలి. వైద్యుల సూచనతో మందులు వాడితే కొంత నివారించగలం. పూర్తిగా నయం చేయలేము.
హార్మోన్స్ పై ప్రభావం…
— గొంటుముక్కల శరత్ చంద్ర, ఎం.డి. పల్మనాలజిస్ట్, ఆర్క్ హాస్పిటల్, కర్నూలు
ఊపిరి తీసుకునేటప్పుడు వచ్చే సమస్యలను ముందుగా గుర్తించాలి. శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల సామర్థ్యంపై పరీక్ష చేయించాలి. ఉచ్వాస..నిశ్వాస క్రియలో తేడా ఉంటే.. ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి. అంతేకాక.. హార్మోన్స్ పై ప్రభావం చూపుతాయి. బీపీ, షుగర్ వ్యాధులు వ్యాపిస్తాయి.
సిఓపిడికి చికిత్స.. ఉత్తమం..
— డా. పొట్టి వెంకట చలమయ్య , పల్మోనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, కర్నూలు
ఇన్హేల్డ్ థెరపీ అనేది సిఓపిడి చికిత్సకు ఉత్తమ మార్గం ఎందుకంటే పీల్చే మందులు వ్యాధి ప్రదేశానికి నేరుగా వెళ్తాయి. అందువల్ల, నోటి ద్వారా తీసుకునే మందులతో పోల్చితే అవి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. స్వీయ వైద్యం చేయవద్దు మరియు మీ పల్మోనాలజిస్ట్ సూచించిన మందులను మాత్రమే తీసుకోండి.