‘ మత్తు’కు..బానిస కావొద్దు..
1 min readబంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దు..
- సీనియర్ మానసిక వైద్య నిపుణులు డా. రమేష్ బాబు
కర్నూలు, పల్లెవెలుగు:సమాజంలో యువత చెడు అలవాట్లకు బానిసై… బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డా. రమేష్ బాబు. దివంగత నేత జవహర్ లాల్ నెహ్రూ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కర్నూలు ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో ‘మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సెంటర్ కార్య నిర్వహణాధికారి హుసేన్ బాషా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డా. రమేష్ బాబు, డా. చైతన్య కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. రమేష్ బాబు మాట్లాడుతూ మద్యపానం, గంజాయి,నల్లమందు, కొకైను తదితర మత్తు పదార్థాలు వాడే యువత అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, విద్యాపరమైన ఒత్తిళ్లు , పాఠశాలలందు ఆటపాటలకు అవకాశం లేక… ప్రతిభను బహిర్గతమవడానికి అవకాశాల రాహిత్యము, జన్యు సంబంధ కారణాలు, డ్రగ్సు సులభంగా లభ్యమగుట వంటి దుష్పపరిణామాల వల్ల నష్టపోతారన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యం పెట్టుకుని చదివితే.. ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఆ దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా డా. రమేష్ బాబు సూచించారు. అనంతరం డా.చైతన్య కుమార్ ఈ మాదకద్రవ్యాల తోపాటు చరవాని (సెల్ ఫోన్)దుర్వ్యసనము మొఃగు వాటి వల్ల సంభవించే శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక పరమైన దుష్పరిణామల గురించి క్షణ్ణంగా వివరించారు.