8 మ్యాట్రిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా డిజైన్ కాన్‌క్లేవ్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన హైదరాబాద్‌లోని టి-హబ్‌లో 8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్‌ను నిర్వహించారు. మార్స్ మీడియా, ఇవాల్ స్కిల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫ్యాషన్, జ్యూయెలరీ, ఇంటిరీయర్స్, సస్టెయినబులిటీ, గేమింగ్, ఏఆర్/వీఆర్, ఉత్పత్తులు, హెల్త్‌కేర్, సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యూరిటీ లాంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పరిశ్రమ పెద్దలు ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టీవర్క్స్ సీఈఓ తనికెళ్ల జోగీందర్, మాథ్ టీహబ్ సీఈఓ రాహుల్ పైత్, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 8 మ్యాట్రిక్స్ డిజైన్స్ సంస్థకు తమ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ పరిశ్రమల దిగ్గజాలు, డిజైన్ బ్రాండ్ లీడర్లు కలిసి 250 మంది వరకు పాల్గొన్న ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయి. అనంతరం సృజనాత్మకమైన డిజైన్లు రూపొందించిన పలువురిని అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా 8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజ్ సావన్కర్ మాట్లాడుతూ, సృజనాత్మకతకు, డిజైనింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ ఐటీ శాక మంత్రి శ్రీధర్‌బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మన నిత్యజీవితంలోని పలు అంశాలకు సంబంధించి డిజైనింగ్ చాలా ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అందుకే ఈ ప్రత్యేక సదస్సు నిర్వహించి, అన్ని రంగాల డిజైనింగ్ నిపుణులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.డిజైనింగ్ రంగానికి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉందని, అందువల్ల ఈ సంస్థతో పాటు ఇక్కడకు వచ్చిన అందరికీ శుభాభినందనలు తెలుపుతున్నానని మాథ్ టీహబ్ సీఈఓ రాహుల్ పైత్ అన్నారు. డిజైన్ థింకింగ్ రంగానివే రాబోయే రోజులని, ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి దూరదృష్టితో తెలంగాణ మరోసారి ఈ రంగంలో ముందంజలో ఉండబోతోందని టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా చెప్పారు. విద్య, సాఫ్ట్‌వేర్, జ్యూయెలరీ తదితర రంగాలకు చెందిన డిజైనింగ్ నిపుణులు ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇలాంటివి కళాశాలల్లో కూడా జరగాలని ఆకాంక్షించారు. కేవలం ఇంజినీరింగ్, వైద్య విద్యలే కాక.. ఇలాంటి రంగాలు కూడా ఉన్నాయన్న విషయం విద్యార్థులకు తెలియడం ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఇవాల్ స్కిల్స్ సీఈఓ సౌమ్య రావుల మాట్లాడుతూ, విద్యార్థులకు డిజైనింగ్ రంగంలో ఉన్న అవకాశాలను వివరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలన్నది తమ ధ్యేయమని అన్నారు.