అంబేద్కర్ గురుకుల పాఠశాల సిబ్బందిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
1 min read-వైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుమ్మల సాయికుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం, దానిని పాఠశాల సిబ్బంది ఆ అమ్మాయిని ఆస్పత్రికి తరలించి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి గుమ్మల సాయికుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై ఆయన గురువారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది ఇంటర్ విద్యార్థిని గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకునే వరకు వచ్చిందంటే, అక్కడ విద్యార్థుల పట్ల సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవడం అర్థమవుతుందని, ఈ సంఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అక్కడ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలు అంటే దేవాలయాలుగా భావించే విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, మంచి చదువు ఉంటుంది, నాణ్యమైన భోజనం ప్రభుత్వం అందిస్తుందని ఎంతో ఆశతో తమ బిడ్డలను గురుకులాలలో చేర్పిస్తే వారు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా అక్కడ జరిగిన సంఘటనలు చూస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని దీనిపై మరింత లోతుగా విద్యాశాఖ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అసలు ఏమి జరిగిందనే విషయాన్ని తొక్కి పెట్టి గోప్యంగా ఉంచవలసిన అవసరం ప్రిన్సిపాల్ కు ఏమొచ్చిందని ఆయన ప్రిన్సిపల్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు గురుకుల పాఠశాల పై దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన అన్నారు.