ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి టి.జి. భరత్
1 min readఎస్.ఏ.పి. క్యాంపు వద్ద నూతన రహదారి పరిశీలన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి. భరత్ అన్నారు. సోమవారం ఎస్.ఏ.పి. క్యాంపులో నూతన రహదారి నిర్మించనున్న ప్రదేశాన్ని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బళ్ళారి చౌరస్తా కూడలిలో ట్రాఫిక్ తగ్గేందుకు, హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలను కొత్త బస్టాండ్ సమీపంలోకి చేరుకునేలా ఎస్ఏపి క్యాంపు మీదుగా కొత్త రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 40 అడుగుల వెడల్పు, 116 మీటర్ల పొడవుతో రహదారికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కిడ్స్ వరల్డ్ సర్కిల్ నుండి ఉస్మానియా కాలేజీ, బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు, అలాగే అంబేద్కర్ సర్కిల్ నుండి రాఘవేంద్ర స్వామి మఠం వరకు రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాజ్ వీహార్ సమీపంలోని ఎల్లమ్మ ఆలయం నుండి జమ్మిచెట్టు వరకు హంద్రీ నది తీరాన బంక్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, డిఎస్పీ మాహాబూబ్ బాష, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.