ఏలూరు కలెక్టరేట్ లో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం
1 min readప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడేలా నడుచుకుందాం
పౌరులుగా ప్రాధమిక బాధ్యతలు నిర్వహిద్దం
ఉద్యోగులు రాజ్యాంగ స్పూర్తితో పనిచేయాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు కలెక్టరేట్ లో మంగళవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బందిచే భారత రాజ్యంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాధ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞచేశారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ కె. వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దిక్చూచిగా డా. బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నిలుస్తుందన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతోపాటు విధులు, బాధ్యతలు కూడా ప్రజలు గుర్తెరిగి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ విధులు రాజ్యాంగ బద్ధంగా సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, సోషల్ వెల్ఫేర్ జెడి వి. జయప్రకాష్, బి.సి కార్పోరేషన్ ఇడి ఎన్. పుష్పలత, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్. నాగరాణి, ఐసిడిఎస్ పిడి కె. పద్మవతి, డిసిపివో సిహెచ్ . సూర్యచక్రవేణి, కలెక్టరేట్ ఎవో నాంచారయ్య, డిఎల్ డివో లక్ష్మి, తదితరులు డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.