భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ‘ షుగర్ ’
1 min readపట్టణాల నుంచి గ్రామీణులకు పాకిన వ్యాధి…
- ఒక్కసారి వచ్చిందంటే… జీవితమంతా..మీ వెంటే…
- మధుమేహగ్రస్తుల ఆరోగ్యం.. ప్రశ్నార్థకం…
- ఆర్థిక దోపిడీ చేస్తున్న ప్రైవేట్ వ్యాపార సంస్థలు
- ప్రభుత్వాలు.. ఉచిత మందులు ఇవ్వాలి…
- ‘డయాబెటిస్ మిల్లెట్స్’ పై అవగాహన సదస్సులో సీనియర్ ఫిజిషియన్ డా. జి. భవాని ప్రసాద్
కర్నూలు, పల్లెవెలుగు:ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం పెరిగేకొద్దీ…. మనిషి శారీరక శ్రమకు దూరమవుతూ ఉన్నాడు. దీనికితోడు మానసిక ఒత్తిడికి గురవుతూ… రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. వ్యాయామం చేయకపోవడం… రోజువారీ పనులు చేసుకోకపోవడం… భోజనం అపరిమితంగా భుజించడం వల్ల మధుమేహ ( చక్కెర) వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం సమాజంలో మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. స్వీయనియంత్రణ లేకపోవడం… చెడు అలవాట్లకు బానిస కావడం తదితర కారణాలతో చక్కెర వ్యాధి వ్యాపిస్తోందని సీనియర్ ఫిజిషియన్ డా. భవాని ప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక ఏ క్యాంపులో ఉన్న కర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో ఆదివారం ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సదస్సులో సీనియర్ ఫిజిషియన్ డా. భవాని ప్రసాద్ ఎం.డి. మెడికల్ విద్యార్థులకు, ప్రజలకు ‘ డయాబెటిస్ మిల్లెట్స్ ’పై అవగాహన కల్పించారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు.. దెబ్బ ’ షుగర్’
ప్రపంచ ధనిక దేశాలలో 5వ స్థానంలో నిలిచిన భారత దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ‘ మధుమేహం వ్యాధి’ విజృంభిస్తోంది. ఒకప్పుడు 8 గంటలు పని చేసే కార్మికులు కూడా 4 లేదా 5 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. దీని వల్ల దేశానికి కొంత నష్టం వాటిల్లినా…. మనిషి కూడా ఆరోగ్యం రీత్యా నష్టపోతాడని తెలుసుకోలేకపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. కంప్యూటర్లకు పరిమితం కావడం… జంక్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం… వ్యాయామం చేయకపోవడం. చేసే పనిలో మానసిక ఒత్తిడికి గురికావడం, జన్యు పరమైన అంశాలు తదితర కారణాలతో మధుమేహ వ్యాధి కబళించే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం సమాజంలో పట్టణాల నుంచి గ్రామీణుల దాకా షుగర్ వ్యాధి వ్యాపిస్తోంది.
‘ మిల్లెట్స్ ’ తో.. కొంత కంట్రోల్
మిల్లెట్స్ ( చిరు ధాన్యాలు) ఆహారంగా తీసుకుంటే.. షుగర్ కొంత మాత్రమే కంట్రోల్లో ఉంటుందని పేర్కొన్న డా. భవాని ప్రసాద్… ఒక్కసారి వ్యాధి వచ్చిందంటే.. ఒక జీవితమంతా మీ వెంటే ఉంటుందని వెల్లడించారు. ఆహార నియమాలు, వ్యాయామం.. ( వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ) చేస్తే.. ఆరోగ్యం బాగుంటుందని వివరించారు.
‘షుగర్ ’ మందులు ..ఫ్రీగా ఇవ్వాలి…
దేశంలో ప్రైవేట్ డ్రగ్స్ వ్యాపార సంస్థలు ఆర్థిక దోపిడీ చేస్తున్నాయని ఆరోపించిన డా. భవాని ప్రసాద్…. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉచితంగా షుగర్ మందులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు దాటిన వ్యక్తికి వచ్చే పింఛన్, పదవీ విరమణ పొందిన ఉద్యోగికి వచ్చే పెన్షన్… అంతా షుగర్ మందులకు, పరీక్షలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా సీనియర్ ఫిజిషియన్ డా. భవాని ప్రసాద్ ఎం.డి. కోరారు.
డా.భవాని ప్రసాద్ కు ఘన సన్మానం
కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘డయాబెటిస్ మిల్లెట్స్ ’ పై విద్యార్థులకు, ప్రజలకు పూర్తిగా వివరించిన డా. భవాని ప్రసాద్ ను కార్డియాలజిస్ట్, రిటైర్డు సూపరింటెండెంట్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులు చంద్ర శేఖర్ కల్కూర తదితరులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.